రిటైర్మెంట్ వేళ మన్మోహన్ కు మోడీ అరుదైన ప్రశంస..

రాజకీయాల్లో అప్పుడప్పుడూ అరుదైన ఘటనలు చూస్తుంటాం. ప్రత్యర్ధులపై విమర్శలతో నేతలు కాలం గడిపేస్తున్న రోజుల్లో ఓ బలమైన రాజకీయ నేత మరో ప్రతిభావంతుడైన మాజీ నేతను ప్రశంసలతో ముంచెత్తడం ఇవాళ కనిపించింది. అదీ తన రాజకీయ ప్రత్యర్ధి పార్టీ అని తెలిసి కూడా ఈ ప్రశంసలు చేయడం పరిణిత రాజకీయానికి నిదర్శనంగా నిలిచింది. అలాంటి అరుదైన ఘటనకు రాజ్యసభ వేదికగా నిలిచింది.

 

రాజ్యసభ సభ్యుల్లో పలువురు వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. దీంతో రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యులకు సెండాఫ్ ఇచ్చేందుకు ఇవాళ ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన ప్రధాని మోడీ పార్లమెంటరీ రాజకీయాలు ఎలా మార్పు చెందుతున్నాయో చెప్పుకొచ్చారు. అదే సమయంలో మాజీ ప్రధాని, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ను ప్రధాని మోడీ ఉదాహరణగా ప్రస్తావించారు.

 

పార్లమెంట్ సభ్యులకు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పూర్తి అని ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. గతంలో ఓ కీలక చట్టంపై ఓటింగ్ కోసం అనారోగ్యంతో ఉన్నా వీల్ చైర్ లోనే వచ్చి మన్మోహన్ సింగ్ ఓటేశారంటూ ఆయన నిబద్ధతను కొనియాడారు. ఆ రోజు సభలో జరిగిన ఓటింగ్ లో ప్రభుత్వమే గెలుస్తుందని తనకు తెలుసని, అయినా డాక్టర్ మన్మోహన్ సింగ్ వీల్ చైర్ పై వచ్చి ఓటు వేశారని గుర్తు చేసుకున్నారు. ఓ సభ్యుడు తన విధుల పట్ల ఎంత అలర్ట్ గా ఉంటారనే దానికి ఇదో స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రధాని మోడీ ఇతర సభ్యులకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *