భువనేశ్వర్: ఒడిశాలో ఫొని తుపాను ప్రభావంతో మృతి చెందిన వారి సంఖ్య 41కు చేరుకుంది. మంగళవారానికి రాష్ట్రంలో 37 మంది మరణించినట్లు అధికారులు తెలపగా.. బుధవారానికి ఆ సంఖ్య 41కు పెరిగిందని ఆ రాష్ట్ర పౌర సంబంధాల కార్యదర్శి సంజయ్ సింగ్ పేర్కొన్నారు. గత శుక్రవారం ఫొని తుపాను సృష్టించిన విధ్వంసంతో ఒడిశా తీవ్రంగా నష్టపోయింది. కొన్ని వందల కోట్ల నష్టం వాటిల్లింది. విద్యుత్తు, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావంతో అతలాకుతలమైన రాష్ట్రంలో పునరుద్ధరణ చర్యలు శరవేగంగా జరగుతున్నట్లు ఆయన తెలిపారు. భువనేశ్వర్, పూరీలో అత్యధిక ప్రాంతాల్లో ఇప్పటికే నీటి సరఫరాను పునరుద్ధరించామని పేర్కొన్నారు. విద్యుత్తు సౌకర్యం లేని చోట్ల డీజిల్ జనరేటర్ల సహాయంతో నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మే 12వ తేదీనాటికి రాష్ట్రంలో పూర్తిగా విద్యుత్తును పునరుద్ధించేందుకు శక్తి మేర ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఒడిశాతో పాటు పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అదనంగా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. మే 10వ తేదీనాటికి 80 శాతం పనులు పూర్తి చేస్తామని, మే 12వ తేదికి పునరుద్ధరణ చర్యలను పూర్తి చేస్తామని వెల్లడించారు.
41కు చేరిన ఫొని మృతుల సంఖ్య
గత శుక్రవారం తుపాను తీరం దాటే క్రమంలో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రభావంతో విద్యుత్తు సరఫరాపై తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. 1.56 లక్షల కొత్త విద్యుత్తు స్తంభాలను రాష్ట్రంలో అమరుస్తున్నామని ఆయన తెలిపారు. నీటి, విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు ఏర్పడడంతో రాష్ట్రంలోని బ్యాంకింగ్, అగ్నిమాపక, ఆసుపత్రుల సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు ఆయన తెలిపారు.