నేతల విగ్రహాల ఏర్పాటు, తొలగింపు అంశాలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ… ఆయనకు తీవ్ర అవమానం జరిగిందంటూ… టీఆర్ఎస్ మినహా మిగతా పార్టీలన్నీ ఇప్పటికే చాలా ఆందోళనలు చేశాయి. తాజాగా అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చెయ్యాలంటూ MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ… ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ధర్నా చౌక్‌లో మహాగర్జన నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెలంగాణ నుంచీ భారీ ఎత్తున అంబేద్కర్ మద్దతుదారులు తరలిరావాలని పిలుపివ్వడంతో… భారీగా జన సమీకరణ జరిగే అవకాశాలున్నాయి. ఈ మహాగర్జనకు టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, బీసీ సంక్షేమ సంఘం, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి.నిజానికి మహా గర్జనకు ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
దాంతో కోర్టుకు వెళ్లిన మందకృష్ణ మాదిగ… కోర్టు అనుమతితో సభ నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ సభలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసే అవకాశాలున్నాయి. ఈ సభకు కాంగ్రెస్ నుంచీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ నుంచీ ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ర్యాగ కృష్ణయ్య, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి వంటి నేతలు రాబోతున్నారు. అందువల్ల ఈ సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.పంజాగుట్టలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఉంచి అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఎందుకు తీసేశారని ప్రశ్నించారు వీహెచ్. ఈ నెల 10 తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో ప్రతిష్టించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.