తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అమలులోకి తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం- ఆటోడ్రైవర్లను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పూట గడవని దుస్థితిని ఎదుర్కొంటోన్నారు.
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పిండానికి ఉద్దేశించిన పథకం ఇది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడోరోజే దీన్ని అమలులోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. దీని అమలు తరువాత ఎలాంటి పర్యవసానాలు చవి చూడాల్సి వస్తుందనేది ఊహించలేదు.
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పథకం అమలు తరువాత ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా తగ్గింది. ఈ పథకం అమలు చేయడానికి ముందు తెలంగాణ వ్యాప్తంగా 80 శాతం వరకు ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించే వారు. గంటల కొద్దీ బస్టాపుల్లో పడిగాపులు పడటానికి, రద్దీ బస్సుల్లో ప్రయాణించడం ఇష్టం లేక ఆటోల వైపు మొగ్గు చూపేవారు.
ఫలితంగా ఆటోడ్రైవర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులూ ఉండేవి కావు. ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తరువాత వారి పరిస్థితి తలకిందులైంది. పూట గడవని పరిస్థితిని ఎదుర్కొంటోన్నారు. ఆటో ఎక్కే వారే కరవయ్యారు. మహాలక్ష్మీ పథకం చేయడానికి ముందు.. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి మార్గాలనూ చూపించలేకపోయింది ప్రభుత్వం.
ఈ పథకాన్ని ఎత్తేయాలంటూ ఆటో డ్రైవర్ల యూనియన్ల ప్రతినిధులు డిమాండ్ చేయట్లేదు గానీ.. తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గాలను చూపాలని పట్టుబట్టుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వివిధ రూపాల్లో వారు నిరసనలను తెలియజేస్తూ వచ్చారు. బస్సుల్లో భిక్షాటనా చేశారు. జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలనూ నిర్వహించారు. అయినప్పటికీ- ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించట్లేదు.
రోజురోజుకూ తమ దుస్థితి దారుణంగా మారిపోతోండటంతో కడుపు మండిన ఓ ఆటోడ్రైవర్.. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తనకు తిండి పెట్టే ఆటోను తగులబెట్టి నిరసన తెలియజేశాడు. తమ గోడును ఎవరూ ఆలకించట్లేదంటూ రోడ్డు మీద పడి రోదించడం కలచివేసింది.