మరో రెండు హామీల అమలు.. రేవంత్ కీలక ఆదేశాలు.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నఅర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

 

ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో ఉన్నారు. రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు.

 

ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది? ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్ లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అయిదు గ్యారంటీలకు మొత్తం 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు.

 

వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు వివరించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండు సార్లు సరి చూడాలని కోరారు.

 

దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలని అన్నారు. దరఖాస్తు చేయని వారుంటే.. నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *