సీఎం రేవంత్ రెడ్డిపై లక్ష్మీ పార్వతి షాకింగ్ వ్యాఖ్యలు..!

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా కూడా రాజకీయాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలుగు ప్రజలకు ఆసక్తిని కలిగిస్తుంది. ఏపీ పాలకుల మీద తెలంగాణా నేతలు వ్యాఖ్యలు చేయటం, తెలంగాణా నేతల మీద ఏపీ నాయకులు వ్యాఖ్యలు చేయటం చాలా కాలంగా కొనసాగుతుంది.

 

ఇక తాజాగా ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి తెలంగాణా రాజకీయాలను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి తెలంగాణాలోని సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయ పరిణతి లేదని ఆమె వ్యాఖ్యానించారు.

 

దీంతో రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణా రాష్ట్ర ప్రజలకు కష్టాలు తప్పవని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పైన విరుచుకుపడిన ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్నవారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ పెద్దల వద్దకు ఢిల్లీకి పరుగులు పెట్టాల్సిందే అని పేర్కొన్నారు.

 

ప్రజల సమస్యల పరిష్కారం.. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినంత ఈజీ కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనకు లక్ష్మీ పార్వతి కితాబిచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి చెందిందని, రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించారని వ్యాఖ్యలు చేశారు.

 

ప్రతీ రంగం అభివృద్ధి జరిగేలా కేసీఆర్ శ్రద్ధ తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటి పథకాలను కొనియాడారు. మిషన్ కాకతీయ తో చెరువుల పూడిక తీసి జల వనరులను సంరక్షించి రైతులకు మేలు చేశారని పేర్కొన్నారు. ఇంటింటికీ రక్షిత మంచినీటిని మిషన్ భగీరథ ద్వారా అందించారని లక్ష్మీ పార్వతి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *