క్రీడలు : భారత్‌తో సిరీస్ అంటే ఏ జట్టుకైనా ఆర్థికపరంగా పండుగే. భారీ టీవీ హక్కులతో పాటు ప్రేక్షకాదరణ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ టీమిండియాతో తలపడేందుకు అన్ని జట్లూ ప్రయత్నిస్తాయి. అందుకు ఆస్ట్రేలియాలాంటి పెద్ద జట్టు కూడా అతీతం కాదు. కోవిడ్–19 నేపథ్యంలో ఆర్థికపరంగా భారీ నష్టాలకు గురవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరాదని భావిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఈ సిరీస్ జరగడంపై సందేహాలు రేకెత్తుతుండటంతో సిరీస్ నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. అవసరమైతే మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా కూడా టెస్టు సిరీస్ ఆడించాలని సీఏ భావిస్తోంది. అదే తరహాలో వేర్వేరు వేదికలపై కాకుండా ఒకే చోట కూడా సిరీస్ నిర్వహించే ప్రతిపాదన ఉంది. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులే జరగాల్సి ఉండగా… నష్టం పూడ్చుకునే క్రమంలో అదనంగా మరో మ్యాచ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను జరపాలని కూడా భావిస్తోంది. సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ ఈ విషయాలు వెల్లడించారు.