రేవంత్ Vs కేసీఆర్ ..

తెలంగాణలో సీఎం రేవంత్ – మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ సమర్ధతకు రాజ్యసభ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయం లోనే రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. మూడు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో నెంబర్ గేమ్ ఖాయంగా కనిపిస్తోంది. ఎంపీ ఎన్నికల వేళ ప్రత్యర్ధి పార్టీలను ఆత్మరక్షణ లోకి నెట్టే వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో, ఈ సీట్లు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

 

హోరా హోరీ రాజకీయం తెలంగాణలో సీఎం రేవంత్ – మాజీ సీఎం కేసీఆర్ రాజ్యసభ ఎన్నికల వేళ ఏం చేయబోతున్నారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వద్దిరాజు రవీంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ జోగినపల్లి సంతోష్ పదవీ కాలం ముగియనుంది. దీంతో, వీరు ఖాళీ చేసే స్థానాల్లో కొత్త అభ్యర్దుల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో పార్టీల సంఖ్య బలం ఆధారంగా చూస్తే ఏకగ్రీవానికి అవకాశం కనిపించటం లేదు. పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం కీలకంగా మారనున్నాయి. ముగ్గురు అభ్యర్దులకు జరిగే ఎన్నిక కావటంతో ఒక్కో అభ్యర్ది విజయం కోసం దాదాపుగా 40 మంది సభ్యుల మద్దతు అవసరం.

 

ఎంఐఎం ఎటువైపు కాంగ్రెస్ కు సభలో మిత్రపక్షంతో కలిపి 65 మంది సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎం కు 7 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఒక సభ్యుడిని గెలవాలంటే తమకు ఉన్న సంఖ్యా బలంతో పాటుగా మరో సభ్యుడి మద్దతు అవసరం. ఎంఐఎం నుంచి సహకారం అందుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ రెండు స్థానాలు గెలవాలంటే ప్రస్తుతం ఉన్న 65 మందికి మరో 15 మంది మద్దతు కావాలి. బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సహకరించే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో..ఎంఐఎం సహకరించినా కాంగ్రెస్ క 72 మంది మద్దతు మాత్రమే దక్కుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వకపోతే ఒక్క సీటు దక్కటం కూడా అనుమానమే.

 

సీట్లు దక్కేదెవరికి ఈ సమయంలోనే బీఆర్ఎస్ కు చెందిన మెదక్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవటం పైన పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ ఎమ్మెల్యేల మాత్రం తాము పార్టీ మారే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకమని చెబుతున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేసినా.. ఎంఐఎం మద్దతు లేకపోయినా బీఆర్ఎస్ సీటు దక్కించుకోవటం కష్టమే. ఈ సమయంలో కాంగ్రెస్ రెండో సీటు గెలవటానికి ద్వితీయ ప్రాధాన్యత ఓటు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎంఐఎం మద్దతు దక్కేలా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటు కేసీఆర్ ఫిబ్రవరి 1 నుంచి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు. దీంతో..ఈ నెంబర్ గేమ్ నడుమ రాజ్యసభ ఎన్నికలు తెలంగాణలో రాజకీయంగా ఉత్కంఠను పెంచుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *