కేసీఆర్ చెప్పింది నిజమైంది: కేటీఆర్..

ప్రజల తరపున గొంతుకను వినిపించడంలో దేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని మాజీ మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. దీని వల్ల నష్టపోతున్న ఆటో సోదరులను ఆదుకోవాలన్నారు.

 

బీజేపీ, కాంగ్రెస్ కలిసి కేసీఆర్‌ను, బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని వారు గ్రహించాలని హితవు పలికారు. గతంలోనూ చాలామంది ఇలాగే కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను తొక్కేస్తామన్నారని.. అలాంటివారు ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

 

కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎంత పవర్ ఫుల్‌గా ఉంటారో ఇక చూస్తారు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు. మీ గురువులతోనే కాలేదు, మీ వల్లే ఏం అవుతుంది? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మేనేజ్ మెంట్ కోటాలో సీఎం పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల అమలును తప్పించుకునేందుకు నిత్యం ఏదో ఒక అవినీతి కథ అల్లుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

 

ఆరు డిక్లరేషన్లు అంటూ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని.. నాడు కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాలం క‌లిసి వ‌స్తే వాన‌పాములు కూడా నాగుపాములై బుస‌లు కొడుతాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అమ‌లు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌ని కేటీఆర్ తెలిపారు. రూ. 2 ల‌క్ష‌ల రైతు రుణ‌మాఫీ చేయ‌లేదని విమర్శించారు.

 

రైతుబంధు కింద వారం రోజుల్లోనే రూ. 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘ‌న‌త కేసీఆర్‌ది అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది.. కరెంట్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. తెలంగాణ తెచ్చింది గులాబీ జెండానే. పోయింది అధికారం మాత్ర‌మే.. పోరాట ప‌టిమ కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వ‌చ్చేదా..? తెలంగాణ రాకుంటే సీఎం, డిప్యూటీ సీఎం ప‌ద‌వులు మీకు ద‌క్కేవా..? రేవంత్ రెడ్డి ప‌లికేవ‌న్నీ ప్ర‌గ‌ల్భాలేనని విమర్శించారు.

 

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను త‌ప్పించుకునేందుకు రోజుకో అవినీతి క‌థ అల్లుతున్నారు. ఇక్క‌డ అవినీతి.. అక్క‌డ అవినీతి అని క‌థ‌లు చెబుతున్నారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది.. అవినీతిని వెలికితీయ‌మ‌నే చెబుతున్నాం. అవినీతి జ‌రిగిన‌ట్లు తేలితే బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోండి. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా త‌ప్పించుకుంటే వ‌దిలిపెట్టమ అని కేటీఆర్ హెచ్చ‌రించారు. అధికారంలోకి వ‌స్తామ‌ని కాంగ్రెస్ కూడా న‌మ్మ‌లేదు అని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *