కాంగ్రెస్ లోకి సునీత..

ఎన్నికల వేళ ఏపీ రాజకీయం మారుతోంది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పీసీసీ చీఫ్ షర్మిల కడప జిల్లా పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ సొంత జిల్లాలో షర్మిల ప్రభావం ఏంటనేది చర్చ మొదలైంది. ఈ సమయంలోనే షర్మిలతో సోదరి సునీత భేటీ కానున్నారు. కాంగ్రెస్ లో చేరుతారని చెబుతున్నారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి నివాసానికి షర్మిల వెళ్లనున్నారు. కడప వేదికగా షర్మిల తీసుకొనే నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

 

సొంత జిల్లాకు షర్మిల: వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తరువాత సొంత జిల్లాకు వెళ్తున్నారు. సీఎం జగన్ పైన వరుస విమర్శలు చేస్తున్న షర్మిల..కడపలో కాంగ్రెస్ లో చేరికల పైన ఫోకస్ చేసారు. ఇప్పటికే మాజీ కాంగ్రెస్ నేతలతో షర్మిల మంత్రాంగం ప్రారంభించారు. వరుసగా జిల్లాలు పర్యటిస్తున్న షర్మిల నేడు కడపకు వస్తున్నారు.

 

వివేకా కుమార్తె సునీత ఇప్పుడు షర్మిలతో భేటీ కానుండటం రాజకీయంగా చర్చకు కారణం అవుతోంది. వైఎస్ వివేకా హత్య తరువాత సునీత నేరుగా అవినాశ్ పైన న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ కేసుల్లో పలు ఆరోపణలు చేసారు. షర్మిల వైఎస్సార్టీపీ చీఫ్ గా దీక్షలు చేసే సమయంలోనూ సునీత కలిసి మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సునీత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం వేళ ఈ ఇద్దరి భేటీ పైన ఆసక్తి కొనసాగుతోంది.

 

సునీతతో షర్మిల భేటీ: కడప జిల్లా ఖాజీపాలెంలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. డీఎల్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతగా ఆయన నివాసానికి వెళ్లి షర్మిల పార్టీలోకి ఆహ్వానించనున్నారు. వచ్చే ఎన్నికల్లో రవీంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు.

 

డీఎల్ 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆ తరువాతి కాలంలో వరుసగా జగన్ పైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల నేరుగా డీఎల్ ఇంటికి వెళ్లటం పైన రాజకీయంగా చర్చ మొదలైంది. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో ఎంపీతో సహా అన్ని అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఈ సారి షర్మిల తన సొంత జిల్లాలో కాంగ్రెస్ కు బలం పెంచాలని భావిస్తున్నారు.

 

పోటీ చేసే స్థానాలపై క్లారిటీ: వివేకా కుమార్తె సునీతను ఎన్నికల బరిలోకి దింపాలని షర్మిల ఆలోచనగా ప్రచారం సాగుతోంది. కొంత కాలంగా సునీత పోటీ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడా సునీత మాత్రం తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండటంతో సునీతను ఒప్పించి ఎన్నికల బరిలోకి దించుతారని చెబుతున్నారు.

 

ఇప్పుడు ఈ ఇద్దరి భేటీలో పోటీ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కడప ఎంపీ సీటుతో పాటుగా పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్దులుగా వైఎస్ కుటుంబం నుంచే బరిలో నిలుస్తారని ఇప్పటికే కడప పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం మొదలైంది. దీంతో, ఈ రెండు స్థానాల్లో షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..రెండో స్థానంలో ఎవరిని ఖరారు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *