ఫాక్స్‌కాన్‌ సీఈవో యాంగ్ లీకి పద్మ భూషణ్.. అందుకేనా..?

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (Padma Awards 2024) గురువారం ప్రకటించింది. అందులో వాణిజ్య-పరిశ్రమల రంగంలో నలుగురిని ‘పద్మ’ పురస్కారాలు వరించాయి. యాంగ్‌ లీ (తైవాన్‌)లకు పద్మభూషణ్‌, సీతారామ్‌ జిందాల్‌ (కర్ణాటక), కల్పనా మోర్పారియా (మహారాష్ట్ర), శశి సోనీ (కర్ణాటక)లకు పద్మశ్రీ దక్కాయి. వీరిలో తైవాన్‌కు చెందిన వ్యక్తికి భారత అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ప్రకటించటంతో అందరి దృష్టి ఆయనపై పడింది.

 

యాంగ్‌ లీ (Young Liu) తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ (Foxconn) సీఈఓ. ఈ సంస్థ ఐఫోన్‌ తయారీలో యాపిల్‌ సంస్థకు (70శాతం) అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. యాపిల్‌ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ చేస్తున్న ప్రధాన కంపెనీల్లో ఈ కంపెనీ ఒకటి. కొవిడ్‌ విజృంభించడంతో ఎదురైన సమస్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల చైనా దేశం వెలుపల తయారీ కార్యకలాపాలను విస్తరించింది. అందులో భారత్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దక్షిణ భారతదేశంలోని ఉత్పాదక సదుపాయాలపై భారీగా పెట్టుబడి పెట్టింది.

 

యాంగ్‌ లీకి ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల తయారీ విభాగంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. యాంగ్ లీ మూడు కంపెనీలు స్థాపించారు. 1988లో యాంగ్ మైక్రో సిస్టమ్స్ అనే మదర్‌బోర్డ్ కంపెనీని స్థాపించారు. 1995లో PC చిప్‌సెట్ కోసం IC డిజైన్ కంపెనీ, 1997లో ITeX ను ప్రారంభించారు. భారత్‌లో కొన్ని రాష్ట్రాల్లో ప్లాంట్లను నెలకొల్పారు. సెమీ కండక్టర్ ప్రణాళికల కోసం ఆయన సహకారం అందిస్తున్నారు.

 

భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్‌ తయారీకి భారత్‌ ముఖ్యమైన దేశం కాబోతుందని యాంగ్ లీ పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ సేవలు విస్తరిస్తున్నందుకు గానూ యాంగ్‌ లీకు పద్మభూషణ్‌ పురస్కారం లభించడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించారు. ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *