
విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ పై చెప్పులతో దాడి జరిగింది. హిందూ ఉగ్రవాదంపైనా, స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలో కమల్ పాల్గొన్న వేళ, ఓ వ్యక్తి కమల్ పైకి చెప్పును విసిరాడు. అయితే, అది ఆయన పక్క నుంచి వెళ్లింది. ఈ ఘటనను చూసిన మరికొందరు సైతం కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. వారిని ముందుగానే గుర్తించిన పోలీసులు, కమల్ చుట్టూ రక్షణగా నిలబడి, వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై కొందరు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపైనా కేసు నమోదైంది. కాగా, రెండు రోజుల క్రితం కమల్ హాసన్ మాట్లాడుతూ, మొట్టమొదటి ఉగ్రవాది గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్నే రేపాయి.