భారత్‌తో ఆటలొద్దు.. ఆ దేశాలకు పుతిన్‌ వార్నింగ్..!

భారత్‌ అనుసరిస్తోన్న విదేశీ విధానంపై (Foreign Policy) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) మరోసారి ప్రశంసలు కురిపించారు. అలా పాటించడం నేటి ప్రపంచంలో అంత ఈజీ కాదన్నారు. ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బయటనుంచి ఆటలు ఆడే ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదన్నారు. ‘రష్యన్‌ స్టూడెంట్‌ డే’ సందర్భంగా కాలినింగ్రాడ్‌ ప్రాంతంలోని యూనివర్సిటీ విద్యార్థులతో పుతిన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఆయన మరోసారి ప్రశంసించారు.

 

స్వతంత్ర విదేశీ విధానాన్ని (Foreign Policy) భారత్‌ అనుసరిస్తోందని పుతిన్ అన్నారు. నేటి ప్రపంచంలో అది అంత తేలిక కాదన్నారు. సుమారు 150 కోట్ల జనాభా కలిగిన భారత్‌కు ఆ హక్కు ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో భారత్‌ ఒకటని ఆయన పేర్కొన్నారు. అది కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోనే భారత్‌ ఇంతటి వేగం పుంజుకుందన్నారు.

 

దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని ఊహించడం అసాధ్యమని పుతిన్ అన్నారు. ఈ క్రమంలో భారత్‌, ఆ దేశ నాయకత్వంపై రష్యా ఆధారపడవచ్చని పేర్కొన్నారు. భారత్‌లో రాజకీయ పలుకుబడి కోసం ఆటలాడవద్దని బయటి శక్తులను ఆయన హెచ్చరించారు. అటువంటి ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదన్నారు.

 

భారత్‌కు గొప్ప సంస్కృతి ఉందని పుతిన్ కొనియాడారు. వైవిధ్యంతో పాటు ఎంతో ఆసక్తిగా ఉంటుందన్నారు. జాతీయ టీవీ ఛానెళ్లలో భారతీయ సినిమాలను ప్రసారం చేసే అతికొద్ది దేశాల్లో రష్యా ఒకటన్నారు. ఇలా మరే దేశం చేస్తుందని అనుకోవడం లేదన్నారు.

 

నరేంద్ర మోదీ నాయకత్వంలో మొదలైన ‘మేకిన్‌ ఇండియా’ (Make In India) కార్యక్రమాన్ని రష్యాతో పాటు ఎన్నో దేశాలు వింటున్నాయని పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రణాళికలన్నింటినీ ఆచరణలో పెట్టేందుకు భారత భాగస్వాములతో కలిసి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత్‌కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా రష్యా నుంచే వస్తున్నాయని వెల్లడించారు. 23 బిలియన్‌ డాలర్లతో రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్‌, ఓ చమురు శుద్ధి కర్మాగారం కొనుగోలు, గ్యాస్‌ స్టేషన్లు, పోర్టులు తదితర రంగాల్లో పెట్టుబడులను ఆయన ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *