కేసీఆర్ తో ముగిసిన బీఆర్ఎస్ ఎంపీల భేటీ..పలు కీలక నిర్ణయాలు..!

రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో గులాబీ బాస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి లోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరిగింది.

 

ఈ సమావేశంలో రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కెసిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాజ్యసభ, లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు తో పాటు ఎంపీలు హాజరయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

కేసీఆర్ కు తుంటి ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్ కు వస్తానని ఆయన చెప్పినట్టు సమాచారం. ఇకనుండి ప్రతిరోజు కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటానని కెసిఆర్ చెప్పినట్టు సమాచారం.

 

ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాటం చేద్దామని కెసిఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలని, అధికారంలో లేకున్నా ప్రజల కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని కెసిఆర్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్లో ప్రశ్నించాలని సూచించారు.

 

కృష్ణ నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఇంకా ఇదే సమయంలో రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక అంశాలపై చర్చించిన కెసిఆర్ దాంతోపాటు పలువురు సిట్టింగ్ ఎంపీలను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *