హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (Metro Phase-2) విస్తరణ ప్రతిపాదనలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) ఆమోదం తెలిపినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ 70 కిలో మీటర్ల మేర రెండో దశలో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్‌ల తయారీ శరవేగంగా జరుగుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇటీవల సీఎం ఆదేశాల మేరకు ఫేజ్2 రూట్ మ్యాప్, 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా మెట్రో అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన విషయం తెలిసిందే.
గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా మెట్రో రైలు భవన్లో ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశం కోసం పోరాడి అమరులైన త్యాగమూర్తులకు నివాళులర్పించి, హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రగతిని ఆయన వివరించారు.
ఫేజ్-2లో చేపట్టబోయే మెట్రో సేవలు రాజధానిలోని అన్ని వర్గాలకు అందుతాయని, అలాగే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవి ఆకర్షణీయం అవుతాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హెచ్ఎంఆర్ఎల్ ఇంజినీర్లు, ఉద్యోగులు తమను తాము పునరంకితం చేసుకోవాలని, వినూత్న మార్గంలో కొత్త శక్తితో పనిచేయాలని ఎన్వీఎస్ రెడ్డి పిలుపునిచ్చారు. కాగా, మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్(JBS) నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్‌ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించనున్నారు. దీంతోపాటు మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు మార్గాన్ని సిద్ధం చేయనున్నారు.
ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడిగించనున్నారు. మరోవైపు, ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లకు విస్తరించనున్నారు. ప్రతిపాదిత కారిడార్ 4 లో భాగంగా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కడ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు మీదుగా మైలార్ దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మొత్తం 29 కిలోమీటర్ల వరకు కొత్తగా మెట్రోమార్గాన్ని సిద్ధం చేయనున్నారు.
ఈ కారిడార్‌లో మైలార్ దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్లు రూట్ మ్యాప్ ఖరారైంది. కారిడార్ 5లో రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్‌గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్) వరకు 8 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులోకి రానుంది.
ఇక, కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని విస్తరించనున్నారు. కారిడార్ 7లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు 8 కిలోమీటర్లు కొత్తగా మెట్రోరైలు మార్గానికి రూట్ మ్యప్ సిద్ధమైంది. కొత్తగా 70 కిలో మీటర్లు మేర సిద్ధం చేసిన రూట్ మ్యాప్ పై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్నిప్రకటించనుంది.