లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. మేడిగడ్డ పిలర్లు కుంగడంతో నీరు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వల్లే నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు విస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ విచారణలో కాళేశ్వరం లోపాల పుట్ట అని తేలినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు సరైన సమాచారం ఇవ్వట్లేదని తెలుస్తోంది.
తాజాగా కాళేశ్వరం అవినీతిపై హైకోర్టు ఆదేశాలు జారీ విచారణ చేయడానికి రెడీగా ఉన్నామని సీబీఐ ప్రకటించింది. ప్రాజెక్టుల అవినీతి సంబంధించి రాష్ట్ర పరిధిలో ఉంటుందని తెలిపిన సీబీఐ.. రాష్ట్రం లేకుంటే సుప్రీం గానీ, హైకోర్టు గానీ ఆదేశాలు జారీ చేస్తే దర్యాప్తు చేస్తామని స్పష్టం చేసింది. విచారణకు సంబంధించిన అవసరమైన సౌకర్యాలను రాష్ట్ర సర్కారే కల్పించాలని సీబీఐ ఎస్పీ డి. కల్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని రాంమోహన్ రెడ్డి అనే వ్యక్తి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై సీబీఐ నుంచి కళ్యాణ్ చక్రవర్తి కౌంటర్ దాఖలు చేశారు. కాళేశ్వరం అవినీతిపై ఇప్పటివరకు తమకు ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం నుంచి గానీ కాళేశ్వరానికి నిధులు సమకూర్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి గానీ కంప్లెంట్ రాలేదని వివరించారు. తమకు కోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే విచారణ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, బ్యాంకు, స్టాక్ ఎక్స్ చేంజ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డైరెక్ట్ విచారణ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.
ఒకవేళ హైకోర్టు కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తే మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ బృందం ఏర్పాటు చేయాలన్నారు. ఈ బృందంలో ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్‌ఐలు, సిబ్బంది, ఆఫీసు, వెహికల్స్‌ను రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 25న హైకోర్టులో విచారణ జరపనున్నారు.