ఏపీ రాజకీయం.. రసవత్తర కుటుంబ కథా చిత్రం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంటుంది. ఇప్పటివరకు ఏపీలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు అన్నాచెల్లెళ్ల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంటే, వదిన మరదుల మధ్య ఎన్నికలకు ఎలా వెళ్లాలి అన్న సందిగ్ధం కొనసాగుతుంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఫ్యామిలీ పాలిటిక్స్ ను ఏపీ ప్రజలు ఉత్కంఠగా చూస్తున్నారు.

 

రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఈసారి అధికారంలోకి రావాలని సంక్షేమ పథకాలతో ప్రజాక్షేత్రంలో దూసుకు వెళుతున్నారు. ఈసారి టిక్కెట్లు కేటాయింపు విషయంలోను సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లను కేటాయిస్తున్నారు.

 

 

ఇక ఏపీలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రంగంలోకి దిగిన ఏపీ సీఎం జగన్ సోదరి వైయస్ షర్మిల అన్న పాలనను టార్గెట్ చేస్తున్నారు. జగన్ పాలనలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబడుతున్నారు. ఏపీలో ప్రధానంగా మరుగున పడిన ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకువచ్చి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇచ్చి తీరుతామని ప్రజలకు మాటిచ్చారు. ప్రధానంగా వైసిపి నే టార్గెట్ చేస్తూ షర్మిల రాజకీయం చేస్తున్నారు.

దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలంటే కలిసొచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలని భావించిన టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే జనసేన తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక బిజెపి తమతో పాటు కలిసి వస్తుందేమోనని చంద్రబాబు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

బిజెపి కూడా తమతో పాటు కలిస్తే వైసిపి పరాజయం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు వదిన పురందేశ్వరి వచ్చి ఎన్నికలలో పొత్తుల తోనే వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. టిడిపితో కలిసి పొత్తులతో వెళితే బాగుంటుందన్న భావన పురందేశ్వరికి ఉన్నప్పటికీ అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతం ఇప్పటివరకు రాకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారు.

 

పురందేశ్వరికి, చంద్రబాబు సాక్షాత్తు మరిది కావడంతో బిజెపి టిడిపి పొత్తులపై క్లారిటీ లేకపోవడంతో ఇరువురి మధ్య సందిగ్ధం కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందన్నది తాజా పరిణామాలతో స్పష్టంగా కనిపిస్తుంది. అన్నా చెల్లెల మధ్య పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. ఇక వదిన, మరదుల మధ్య ఎన్నికలలో సఖ్యత కొనసాగుతుందా? లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు చేయాల్సి వస్తుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *