ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై గత కొన్ని రోజులుగా ఆయన సోదరి, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. షర్మిల వ్యాఖ్యలపై ఇవాళ స్పందించిన ఆయన.. పలు సైటెర్లు వేశారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తానని పార్టీ పెట్టి అక్కడే మెట్టినిల్లు అని చెప్పుకున్న షర్మిల.. ఇప్పుడు జమ్మలమడుగులో పుట్టినిల్లు ఉందంటూ ఇక్కడకు వచ్చి విమర్శలు చేయడంపై ఫైర్ అయ్యారు. ముందు ఏడ పిల్లవో తేల్చుకోమని షర్మిలకు పేర్ని సూచించారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని పేర్ని నాని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో చంద్రబాబు కుమ్మక్కైన విషయం తెలియదా అని పేర్ని ప్రశ్నించారు. షర్మిల మొన్నటివరకూ తెలంగాణ అమ్మాయి అన్నారని, ఇప్పుడు ఆంధ్రా అమ్మాయి అంటున్నారని, ముందు ఈ విషయం తేల్చుకోమని సలహా ఇచ్చారు. అలాగే కెఏ పాల్, పవన్, షర్మిల ఏది మాట్లాడినా వారికే చెల్లుతుందన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ తన అన్నని జైల్లో పెట్టిందని షర్మిల ఆరోపణలు చేశారని, చనిపోయిన తన తండ్రిని ముద్దాయిగా పెట్టిందని ఆరోపణలు చేశారని పేర్ని నాని గుర్తుచేశారు. అలాగే సోనియా గాంధీ కుట్ర చేశారని కూడా అన్నారన్నారు.రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని షర్మిల గతంలో ఆరోపించారని, కానీ ఇప్పుడు ఆ ఆరోపణలు అన్నీ ఏమయ్యాయని పేర్నినాని షర్మిలను సూటిగా ప్రశ్నించారు.