నిజామాబాద్ లో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు బీజేపీ జిల్లా కార్యాలయంలో దినేష్ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటును ఎవరూ ఆపలేరని కొద్దిరోజుల్లో ఈ ప్రక్రియ జరిగి తీరుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడిన ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ ఎంత కాలం ఉంటుందో వాళ్ళకే తెలీదన్నారు. కాంగ్రెస్ ఇప్పటివరకు ఇచ్చిన ఒక హామీని సరిగా అమలు చేయలేదని వ్యాఖ్యానించారు. హిందూ మతానికి చేసిన పాపాల వల్లే.. కాంగ్రెస్ పార్టీకి అయోధ్య రామయ్యను చూసే భాగ్యం దక్కలేదు. అయోధ్యకు రాముడొచ్చాడు.. త్వరలో మథురలో శ్రీకృష్ణుడు మందిరంలోకి వస్తారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కోతలు మొదలయ్యాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అర్దం. కరెంట్ కోతలు కాంగ్రెస్ పేటెంట్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇన్ స్టాల్ మెంట్లలో రైతు బంధు ఇస్తున్నారని, రుణ మాఫీ ఎప్పుడు చేస్తారో దేవుడికే తెలియాలన్నారు. కాంగ్రెస్ చెప్పిందొకటి చేసేది ఒకటని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు పంచకుండా గెలుస్తాం. ఎన్నికల్లో గాంధీ నోటు అవసరం లేదు, మోదీ పేరుతో గెలుస్తాం అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కోసం ఉంచిన 7వేల కోట్లు నిధులను ఇద్దరు మంత్రులకు కాంట్రాక్టు బిల్లులకు మళ్లించారని ఆరోపించారు . పసుపు ధర క్వింటాకు 20వేలు ధర ఇప్పించే బాధ్యత నాదే అని పేర్కొన్న ఆయన నిజామాబాద్ లో 200వందల కోట్లతో పసుపు పరిశోధన కేంద్రం పెట్టితీరుతాం అని స్పష్టం చేశారు.