బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై..

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. తమకు ఓటు వేయకుంటే చనిపోతామంటూ కొందరు అభ్యర్థులు బెదిరించడాన్ని ఆమె తప్పుబట్టారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 46 శాతం ఓటింగ్ నమోదైందని.. అలాంటివి పునరావృతం కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ సూచించారు. ఓటు వేసేటప్పుడు అభ్యర్థులను పూర్తిస్థాయిలో విశ్లేషించి మంచి వారిని ఎన్నుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఇచ్చే సెలవును టూర్ల కోసం ఉపయోగించడం బాధాకరమని గవర్నర్ వ్యాఖ్యానించారు.

 

ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వినియోగించుకోవడమే పౌరుల ప్రథమ బాధ్యత అని గుర్తు చేశారు. ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తం నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు గవర్నర్ బహుమతులను అందించారు. గత ఎన్నికల్లో తనకు ఓటు వేయకుంటే చనిపోతానని బెదిరించిన వారూ ఉన్నారని.. అలాంటి విషయాలను ఉపేక్షించవద్దని ఎన్నికల సంఘానికి గవర్నర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో వికాస్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

కాగా, ప్రస్తుత బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ఓటు వేయకుంటే తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, గతంలో గవర్నర్ పై కౌశికర్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *