ప్రముఖ సోషల్ మీడియా వేదికల నుంచి భారీగా డేటా చౌర్యం..

సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు సంచలన విషయాలను తెరపైకి తెచ్చారు. ట్విట్టర్, లింక్డిన్ తదితర సైట్ల నుంచి భారీ మొత్తంలో డేటా చౌర్యానికి గురైందని వెల్లడించారు. సుమారు 2,600 కోట్ల రికార్డులు లీకయ్యాయని, ఈ డేటా ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే వెబ్ పేజిలో దర్శనమిచ్చిందని సెక్యూరిటీ డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థలకు చెందిన పరిశోధకులు తెలిపారు.

 

ఈ ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే వెబ్ పేజికి ఎలాంటి రక్షణ లేదని, అందువల్ల ఇది అత్యంత ఆందోళనకర అంశమని వారు వివరించారు. ఈ డేటాను సైబర్ నేరగాళ్లు ఐడీల చౌర్యానికి, అమాయకులకు వల విసరడానికి, వ్యక్తిగత, కీలక ఖాతాలను యాక్సెస్ చేయడానికి దుర్వినియోగం చేసే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

 

చైనా సోషల్ మీడియా సంస్థలు టెన్సెంట్, వీబోలకు చెందిన యూజర్ల డేటా కూడా ఈ వెబ్ పేజీలో ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు, టెలిగ్రామ్, అడోబ్, కాన్వా వేదికలకు చెందిన రికార్డులు కూడా వీటిలో ఉన్నాయి.

 

ముఖ్యంగా, మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ వెబ్ పేజీలో ఉన్న రికార్డుల్లో అమెరికా, ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఫైళ్లు కూడా ఉన్నాయన్న విషయం వెల్లడైంది. కొంచెం ఊరట కలిగించే విషయం ఏమిటంటే… చోరీకి గురైన 2,600 కోట్ల రికార్డుల్లో కేవలం కొద్దిభాగం మాత్రమే ఇటీవలి సమాచారం. మిగతాది అంతా చాలా పాత సమాచారం అని గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *