ఊపందుకున్న ఏపీ పాలిటిక్స్.. జగన్‌పై పోరాటానికి షర్మిల సిద్ధం..!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు . పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ మొదలు పెడుతున్నారు . ఆ క్రమంలో ఏపీలో కాంగ్రెస్‌ను వీడిన ముఖ్యనేతలను వెనక్కిరప్పించడానికి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయంట. మరోవైపు పార్టీకి దూరమైన ఎస్సీ ఓటు బ్యాంకును తిరిగి ఆకట్టుకోవడానికి ఆమె ఇప్పటికే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. పార్టీ ప్రెసిడెంట్‌గా మాట్లాడిన తొలి స్పీచ్‌లోనే ఆమె క్రిస్టియన్లతో పాటు ఎస్సీల ప్రస్తావన తెచ్చి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కార్యరంగంలోకి దిగారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు . ఆ మేరకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల షెడ్యూల్ ఖరారయ్యింది. ఈసారి 175 అసెంబ్లీ సీట్లలో, 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు.

 

రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ని తిరిగి గాడిలో పెట్టే బాధ్యత షర్మిల భుజాలపై పడింది. ఆమె క్షేత్రస్థాయిలో అందరిని కలుపుకొని వెళ్లే ప్రయత్నాల్లో పడ్డారు. పార్టీలోకి కీలక నేతలను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యువతరం నేతలతో షర్మిల చర్చిస్తున్నారని తెలిసింది. మరోవైపు వైఎస్‌తో అనుబంధం గల నేతలతో కేవీపీ చర్చలు జరుపుతున్నారని సమాచారం . కొత్త, పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నారు.

 

రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యనేతలు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. అలాగే కేడర్‌తో పాటు సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా చెల్లాచెదురైంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉంటూ వచ్చిన ఎస్సీలు, క్రిస్టియన్లు గత్యంతరం లేని పరిస్థితుల్లో పక్క పార్టీల వైపు మొగ్గారు. ఇప్పుడు వారిని ఆకట్టుకోవడంపై షర్మిల ఫోకస్ పెడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకోనున్నాయి. ఈ క్రమంలో వైఎస్ షర్మిల పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించగానే ఏపీలో హఠాత్తుగా క్రిస్టియన్ జనాభాను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

 

పీసీసీ చీఫ్‌గా తన తొలి స్పీచ్‌లోనే సీఎం జగన్‌ క్రైస్తవ వ్యతిరేకని షర్మిల మండిపడ్డారు. మణిపుర్‌లో రెండువేల చర్చిలు ధ్వంసం చేసినా, 60 వేల మంది క్రైస్తవులకు నిలువనీడ లేకుండా చేసినా క్రైస్తవుడైన జగన్‌ ఎందుకు మాట్లాడలేదని ఆమె ధ్వజమెత్తారు. ఇంత జరిగినా జగన్ బీజేపీతో మిత్రత్వం కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపుర్‌ ఘటనపై జగన్‌ మాట్లాడకపోతే క్రైస్తవుల కడుపులు మండవా? వారికి మనసు లేదా? వారు మనుషులు కాదా? అంటూ ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా దళితులపై దాడులు వందకు వంద శాతం పెరిగాయంటూ విమర్శలు గుప్పించారు. ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్‌, మైనింగ్‌ మాఫియా దోచుకోవడం, దాచుకోవడం ఇంతకంటే రాష్ట్రంలో ఏం జరిగిందని ధ్వజమెత్తారు.

 

గత ఎన్నికల్లో ఎస్సీ, క్రిస్టియన్ ఓటు బ్యాంకు అండగా వైసీపీకి అండగా నిలిచింది. 2019లో దాదాపు 68 శాతం ఎస్సీలు జగన్‌ పార్టీకి ఓటేసినట్లు అంచనా. ఇప్పుడు వారి ఓట్లే టార్గెట్‌గా షర్మిల పావులు కదుపుతుండటంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందంటున్నారు. మరోవైపు షర్మిల భర్త బ్రదర్ అనిల్ క్రైస్తవ మత ప్రచారకులు కావడంతో ఆయన ప్రభావం వారిపై ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే సమయంలో అనిల్ ఆమె వెంటే ఉన్నారు. దాంతో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడం ఖాయం అంటున్నారు. దాంతో షర్మిల భర్తకు క్రిస్టియన్లలో ఉన్న ఆదరణ జగన్‌కు మైనస్ అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే షర్మిల ఏకంగా జగన్‌ క్రైస్తవ వ్యతిరేకి అని ఫైర్ అవుతూ క్రైస్తవుల ఓట్లు గుంపగుత్తగా కాంగ్రెస్ వైపు మార్చేసే పని మొదలు పెట్టేశారు. ఏపీలో కోటికి పైగా ఎస్సీ జనాభా ఉన్నట్లు లెక్కలు చెపుతున్నాయి. 2009 వరకు ఆ ఓటర్లలో అత్యధిక శాతం కాంగ్రెస్‌కే మద్దతిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి మారిపోవడంతో ఆ ఓటు బ్యాంకు టీడీపీ, వైసీపీల వైపు మళ్లింది. 2019 ఎన్నికల సమయానికి జగన్‌కు ఛాన్స్ ఇచ్చింది.

 

అదలా ఉంటే ఏపీలో మొత్తం 24 ఎస్సీ నియోజకవర్గాలుంటే వైసీపీ పెద్దలు ఇప్పటికే 21 చోట్ల అక్కడి సిట్టింగు ఎమ్మెల్యేలను తప్పించడమో? నియోజకవర్గాలు మార్చడమే చేశారు. దాంతో ఆయా ఎస్సీ నేతలు అసంతృప్తిత రగిలిపోతున్నారు. ఆ పరిస్థితిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకోవడానికి షర్మిల ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు. మరి చెల్లెలు ఎక్కుపెట్టిన క్రిస్టియన్, ఎస్సీ అస్త్రాలపై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *