అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూర్తి….

కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయింది. వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత గర్భగుడిలో ప్రధాని మోదీ స్వామి వారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. స్వామి వారికి తొలి హారతిని ఇచ్చారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు.

 

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామజన్మభూమిపై హెలికాప్టర్లతో పూలను చల్లారు. మరోవైపు, రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ప్రసన్న వదనం, చిరు దరహాసం, స్వర్ణాభరణాలతో, ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాల రాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఈరోజు యావత్ దేశం రామ నామ స్మరణతో మారుమోగింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *