భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమైంది…

అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠతో భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమైందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆయన మాట్లాడుతూ… ఒక ప్రధాన సమాజం తమ దేవుడికి అయోధ్యలో సరైన స్థానం కల్పించడం కోసం వందల సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చిందన్నారు. హిందువులు తమ రాముడికి గుడి నిర్మించడం కోసం 500 ఏళ్లు కష్టపడవలసి రావడం చరిత్రలోనే తొలిసారి అన్నారు. 1990లలో కరసేవకులపై కాల్పులను ప్రస్తావిస్తూ, ఇప్పుడిక అయోధ్యలో కర్ఫ్యూలు, కాల్పులు ఉండవని అన్నారు.

 

రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున దేశమంతా రామమయంగా మారిందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీని యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. మోదీ దూరదృష్టి, అంకితభావంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. అయోధ్యకు పూర్వ వైభవం తీసుకు రావడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారమైందన్నారు.

 

1990 అక్టోబర్‌లో అయోధ్యలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో 17 మంది చనిపోయారు. ఈ ఘటనను గుర్తు చేస్తూ రాముడి ఆలయం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. హిందువులు, దేవుడు కోరుకున్న చోట ఆలయం నిర్మితమైందన్నారు. ఈ క్షణం కోసం దేశమంతా ఎదురు చూసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *