ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తూ బహిరంగ సభలను నిర్వహిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రతిరోజు రా కదలిరా సభలలో జగన్ ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజలకు తెలియజేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదిలి రా సభ నిర్వహించారు.
కోనసీమ జిల్లాలో నిర్వహించిన రా.. కదలి రా బహిరంగ సభలో రానున్న ఎన్నికల్లో అమలాపురం జిల్లాలోని ఏడు స్థానాలు తెలుగుదేశం జనసేన కూటమి కైవసం చేసుకోవడం తద్యం అన్నారు. పార్టీలో ఆయారాం గయారాం లను పట్టించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వారికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వనన్నారు. అవకాశం కోసం టీడీపీ వైపు చూస్తున్న వారికి షాక్ ఇచ్చారు.
తాము అధికారంలోకి వస్తే ఏడాదికి నాలుగు లక్షలు చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఆక్వా రంగాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆక్వారంగాన్ని ఆదుకుంటామని, రాయితీపై విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు లేని ధరలు సృష్టించి ప్రభుత్వ సొమ్మును దోచేశారన్నారు.
వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రజలకు సీఎం జగన్ రూ.10 ఇచ్చి, రూ.100 వసూలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందివ్వకుండా ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు.
సైకో పాలనలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. నాసిరకం మద్యంతో పేదప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమన్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వైసీపీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు