జనసేనకు మాట మాత్రమైనా చెప్పకుండా.. టీడీపీ అభ్యర్థుల ఖరారు..

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో 68 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

 

తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. దీనికి సన్నాహకమా అన్నట్లు రా.. కదలిరా సభా వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ వస్తోన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

 

 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును ప్రకటించారాయన. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆయనను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయనే ఇక్కడి ఎమ్మెల్యే. సిట్టింగ్‌కే టికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారాయన.

 

జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ.. మండపేట నుంచి పోటీ చేయడానికి సర్వసన్నాహాలు చేసుకుంటోన్నప్పటికీ- ఏకపక్షంగా అభ్యర్థులను ఖరారు చేయడం వివాదాన్ని రేకెత్తిస్తోంది. టీడీపీ మిత్రపక్షం జనసేనలో చిచ్చురేపినట్టయింది. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటోన్నారనే వివాదం మొదలైంది.

 

జనసేన సీనియర్ నేత లీలాకృష్ణ.. మండపేట నుంచి పోటీ చేయడానికి ముందు నుంచే సన్నాహాలు చేపట్టిన విషయం తెలిసిందే. 2019 నాటి ఎన్నికల్లోనూ ఆయన జనసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. 35 వేలకు పైగా ఓట్లను సాధించగలిగారు. ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉన్న క్రమంలో మండపేట సీటు జనసేనకే వస్తుందనే ఆశతో ఉన్నారు లీలాకృష్ణ.

 

 

అనూహ్యంగా జనసేన అగ్రనాయకత్వానికి మాట మాత్రమైనా చెప్పకుండా మండపేట నియోజకవర్గానికి అభ్యర్థిగా వెగుళ్ల జోగేశ్వరరావును ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు ప్రకటన తరువాత మండపేట రాజకీయాల శరవేగంగా మారిపోయాయి. లీలాకృష్ణ పార్టీ నాయకులు, తన అనుచరులతో సమావేశం అయ్యారు.

 

చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సీట్ల సర్దుబాటు, పంపకాలు ఇంకా పూర్తి కాకముందే అభ్యర్థిని ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన అనే పేరు కూడా ఎత్తకుండా పొత్తులో భాగమనీ చెప్పకుండా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంటూ జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ప్రకటించారని, ఇది సరికాదని వ్యాఖ్యానించారు.

 

జనసేనతో పొత్తు ఉందనే మాటను చంద్రబాబు ఎక్కడా వాడట్లేదంటూ పేర్కొన్నారు. మండపేట.. జనసేనకు అత్యంత బలమైన నియోజకవర్గం అని, గత ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వచ్చాయనీ గుర్తు చేశారు. అందుకే తాము ఈ సీటును ఆశిస్తోన్నామని అన్నారు. మండపేట టికెట్‌ను తాము ఆశిస్తున్నామని, ఖచ్చితంగా తాను ఇక్కడి నుంచే బరిలో ఉంటానని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *