జనగామ జిల్లాలో వెలుగుచూసిన దారుణం… చెప్పాపెట్టకుండా కూతురిని తీసుకెళ్లిపోయాడని మామపై కక్ష పెంచుకున్న అల్లుడు… అర్ధరాత్రి అత్తింటికి చేరుకుని గొడవ..
భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ… మామ ప్రాణాలు తీసింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో వెలుగుచూసింది. జనగామ జిల్లా కడగుట్టతండా గ్రామానికి చెందిన 48 ఏళ్ల ధారవత్ సోముల కూతురు మంజులను, దేవరుప్పల మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన దేవాకు ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లైన తర్వాత కొన్నాళ్లు సఖ్యంగానే ఉన్న మంజుల, దేవా దంపతుల మధ్య ఆరు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. భర్తతో గొడవపడిన మంజుల, తండ్రికి ఫోన్ చేసి వచ్చి పుట్టింటికి తీసుకెళ్లమని కోరింది. కూతురు కోరగానే ధర్మాపురం గ్రామానికి చేరుకున్న సోముల… కూతురిని కడగుట్టతండాకు తీసుకొచ్చాడు. చెప్పాపెట్టకుండా భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆగ్రహానికి లోనైన దేవా… తన తల్లిదండ్రులకు కలిసి అత్తగారింటికి చేరుకున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాత్రి ఒంటి దాకా సాగిన ఈ గొడవలో తీవ్ర ఆవేశానికి లోనైన దేవా… పక్కనే ఉన్న కర్ర తీసుకుని మామ సోముల తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయమైన సోముల… అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సోముల కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు… దేవాను అరెస్ట్ చేశారు. తన భార్యను చెప్పా పెట్టకుండా తీసుకురావడమే కాకుండా, తనను తిడుతూ మాట్లాడడంతో తీవ్ర ఆవేశానికి లోనై మామను కొట్టానని అంగీకరించాడు దేవా. కేసు దర్యాప్తులో ఉంది.