వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లు కైవసం చేసుకునేలా.. వైనాట్ 175 నినాదంలో దూసుకుపోతున్న వైసీపీ.. పక్కా ప్రణాళిక ప్రకారం సీట్ల విషయంలో మార్పుచేర్పులు చేస్తోంది. హోంమంత్రి తానేటి వనితను.. కొవ్వూరు నుంచి గోపాలపురం బదిలీ చేయడం ద్వారా అక్కడ తమ గెలుపు నల్లేరుపై నడకంటూ అధికారపార్టీ భావిస్తోంది. గోపాలపురం నియోజకవర్గంలో గతంలో తనతో పాటు తన తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం తానేటి వనితకు కలిసొస్తుందా ? అసలు.. వనిత.. ఎందుకు నియోజకవర్గ మార్పు కోరుకున్నారు.
కొవ్వూరు ఎమ్మెల్యే, ప్రస్తుత హోమ్ మంత్రి తానేటి వనితకు తొలి నుంచి వివాదరహితురాలిగా పేరుంది. పార్టీకి విధేయతతో ఉండటంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లటంలోనూ ఆమె.. ముందుండి పనిచేస్తారనే వైసీపీ వర్గాలే చెబుతాయి. YCP ప్రకటించిన నాలుగో విడత అభ్యర్థుల జాబితాలో తానేటి వనితను గోపాలపురం నియోజవర్గానికి బదలాయించారు. కొవ్వూరు సిట్టింగ్‌గా ఉన్న వనితను గోపాలపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
కొన్నాళ్లుగా తానేటి వనితకూ నియోజకవర్గ మార్పు తప్పదనే వార్తలు వినిపించాయి. ఆమె కొంతకాలంగా గోపాలపురం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని.. ఆ దిశగా పార్టీ అగ్ర నాయకులతో మంతనాలు జరపడంలో సఫలం అయినట్లు తెలుస్తోంది. కొవ్వూరు ఎమ్మెల్యే వనిత సీఎం జగన్ టీమ్‌లో.. యాక్టివ్‌గా ఉంటూ క్యాబినెట్‌లోనూ చురుగ్గా ఉంటారనే వైసీపీ నేతలే చెబుతారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే తానేటి వనితను క్యాబినెట్ లోకి తీసుకుని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు.. నియోజకవర్గం బాధ్యతలు చూసుకుంటూనే.. మంత్రిగా సుడిగాలి పర్యటన చేస్తూ తన శాఖ మీద పట్టు తెచ్చుకున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ రెండోసారి మంత్రివర్గ విస్తరణలోను అనూహ్యంగా సీటు సంపాదించడంతోపాటు హోంమంత్రిగా నియమితులవడంతో వనిత.. సీఎంకు ఆప్తురాలిగా మారిందని నియోజకవర్గంలో వినికిడి.
2019 ఎన్నికల్లో YCP అధిష్టానం ఆదేశాలతో తన సొంత నియోజకవర్గమైన గోపాలపురంను వదిలి కొవ్వూరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. తన సొంత నియోజకవర్గ కాకపోయినా కొవ్వూరులో వైసిపి కార్యకర్తలు నాయకులు వనితకు చేదోడుగా ఉంటూ ఆమె విజయంలో కీలకపాత్ర పోషించారని చెప్పొచ్చు. కార్యకర్తల పట్ల ఆమె ఆప్యాయంగా ఉంటారని.. కష్టం వస్తే తమ బాగోగులు చూసుకుంటుందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో వనితను వేరే చోటకి పంపించటం ఏంటనే ప్రశ్నలూ లేవనెత్తున్నాయి.
తానేటి వనిత స్వస్థలం గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం యర్నగూడెం. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గోపాలపురం నుంచి విజయం సాధించారు. YSRCP ఆవిర్భావం తర్వాత జగన్ టీమ్‌లో చేరి.. 2014లో కొవ్వూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో కొవ్వూరు నుంచి నుంచి గెలిచి హోంమంత్రి అయ్యారు. వనిత తండ్రి బాబాజీరావు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ గోపాలపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పని చేశారు.. తానేటి వనిత సొంత నియోజకవర్గ గోపాలపురం కావటం ప్రస్తుతం అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ మారితే తనకు అన్ని విధాల కలిసొస్తుందని ఆలోచనలతో సీఎం జగన్ ను ప్రత్యేకంగా వనిత అభ్యర్థించినట్లు సమాచారం.
గోపాలపురం నియోజకవర్గంలోని టీడీపీలో ఉన్న విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వనిత యత్నిస్తున్నారని వార్తలూ ఉన్నాయి. ఇటీవల గోపాలపురంలో నిర్వహించిన పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్రలో వనిత పాల్గొన్నారు. కొంతకాలంగా గోపాలపురం నియోజకర్గంలో ఆమె పేరుతో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దీంతో ఆమె ప్రణాళికాబద్ధంగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గోపాలపురంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం..అధికార పార్టీ నేతల అండదండలు వనితకు ఏం మేర కలిసివస్తాయో చూడాలి.
గోపాలపురంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం.. అధికార పార్టీ నేతల అండదండలు వనితకు ఏం మేర కలిసివస్తాయో చూడాలి.