తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన కొనసాగుతోంది. మూసీ నదీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించారు. మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. సమావేశంలో థేమ్స్ నది చరిత్ర, నది అభివృద్ధికి ఎదురైన సవాళ్లు,పెట్టుబడి, ఇంజినీరింగ్, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.
హైదరాబాద్‌లో మూసీ,ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్, వంటి చెరువుల ప్రాధాన్యత నిపుణులకు వివరించారు.హైదరాబాద్‌లో ఉన్న చెరువుల ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. మూసీకి పునర్‌వైభవం తీసుకువస్తే నది, చెరువులతో హైదరాబాద్ మరింత పర్యాటక ప్రాంతంగా మారుతుందని సీఎం తెలిపారు. ముందు ముందు హైదరాబాద్ మరింత శక్తివంతమవుతుందని పేర్కొన్నారు. మూసీ విజన్ 2050కి స్పందించిన పోర్ట్ ఆఫ్ లండన్ బృందం పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం తో మరిన్ని చర్చలు, భాగస్వామ్యానికి సిద్ధమని పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు ప్రకటించారు.