తొలి జాబితా సిద్దం చేస్తున్న టీడీపీ…

టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా త్వరలో విడుదల చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి టికెట్ల కోసం టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. అభ్యర్థుల ఎంపికపైన నారా లోకేశ్ కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తవుతున్న నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు లోకేశ్ దగ్గరికి చేరుకుంటున్నారు.

 

టీడీపీ అభ్యర్ధుల తొలి జాబితాను సిద్ధం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఈ క్రమంలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు చంద్రబాబు, లోకేశ్‌ల వద్దకు క్యూ కడుతున్నారు. సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు లోకేశ్.. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తారన్న వార్తల నేపథ్యంలో టికెట్లు ఆశిస్తున్న నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఎంత మందితో లిస్టు రిలీజ్ చేయబోతున్నారు? జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు ఉండవు? అనే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

 

అనంతపురం నగరంలో టీడీపీ, జనసేన పార్టీ నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. టిడిపి నుంచి మాజా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జనసేన నుంచి వరుణ్ టికెట్ రేసులో కనిపిస్తున్నారు. అయితే పవన్‌కళ్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తే .. తన సీటు త్యాగం చేసి.. తన భుజస్కందాల మీద మోసి ఆయన్ని దగ్గరుండి గెలిపిస్తానని అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అంటున్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు. మరి పవన్ కాకుండు వేరెవరైనా అక్కడ నుంచి బరిలో ఉంటే ప్రభాకరచౌదరి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక వైసీపీలో అనంత సీటుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి ,మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిల మధ్య పోటీ నడుస్తోంది. ఆ ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కినా మరో వర్గం సహకరించే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.

 

సింగనమల నియోజకవర్గం లో టిడిపికి సంబంధించి మాజీ ఇన్‌చార్జ్ బండారు శ్రావణి ,ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు, మాజీ మంత్రి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ కూడా టిడిపి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది.. ఈ నేపథ్యంలో బండారు శ్రావణి వెళ్లి లోకేశ్‌ను కలిసి తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కళ్యాణ్ దుర్గం నియోజవర్గంలో టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గం ప్రస్తుత ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు కోటపాటిగా టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

 

రాయదుర్గం నియోజకవర్గం టీడీపీలో సైతం పొలిటికల్ పందెం కోళ్లు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకి పోటీగా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు టిడిపి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక పెనుగొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, కురవ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ సబిత మధ్య టిడిపిలో టికెట్ కోసం వార్ నడుస్తుంది.

 

ధర్మవరంలో ప్రస్తుతం టీడీపీ ఇన్‌చార్జ్‌గా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమితో బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి. తిరిగి టీడీపీలోకి వచ్చి టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారంట.. అలాగూ జనసేన నుంచి మధుసూదన్ రెడ్డి పోటీ చేయడానికి రెడీ అవుతుండటంతో అక్కడ మూడుముక్కలాట నడుస్తోంది.

 

పుట్టపర్తి నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామంటున్నాయి టిడిపి శ్రేణులు. పార్టీలోని మెజార్టీ వర్గం పల్లె రఘునాథ్‌రెడ్డి అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. దాంతో బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడానికి పార్టీ పెద్దలు బలిజ, బోయ, వడ్డెర సామాజిక వర్గాల్లో బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోందంట. మరి వేరే అభ్యర్ధి బరిలోకి దిగితే పల్లె స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

 

గుంతకల్ నియోజకవర్గంలో టిడిపి నుంచి జితేంద్ర గౌడ్, జనసేన నుంచి మధుసూదన్ గుప్తాలు టికెట్ రేసులో కనిపిస్తున్నారు. తమతమ అధినేతల దగ్గర ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో రాయలసీమలోనే అత్యధికంగా జనసేనకు 19 వేలకు పైగా ఓట్లు లభించిన ఏకైక నియోజకవర్గం గుంతకల్లు కావడం గమనార్హం. దాంతో జనసేన గుంతకల్లు సీటు కోసం పట్టుబట్టే పరిస్థితి కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *