ఏపీలో సంక్రాంతి పందెం కోళ్ళ సందడి.. వందల కోట్ల రూపాయల బెట్టింగులతో హడావిడి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. సంక్రాంతి పండుగకు చాలామంది ప్రజలు ఏపీలోని తమ సొంత ఊర్లకు వెళ్లి పండుగ జరుపుకుంటారు. ఇక తెలుగువాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో జరుగుతున్న కోడిపందాలను చూడడానికి వెళ్లే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.

 

ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిపందాలను నిర్వహించకూడదని పోలీసులు కఠినంగా చెప్పినప్పటికీ, హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంక్రాంతికి కోడి పందాల బరులు వెలిశాయి. రూ.వందల కోట్ల పందాలు సంక్రాంతి సందర్భంగా కొనసాగుతున్నాయి .

 

 

ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని పలుమైదానాల్లో కోడిపందాలతో ఇప్పటికే తిరునాళ్ల వాతావరణం కనిపిస్తోంది. మంత్రులు సహా ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరి పోటీలను నిర్వహిస్తున్నారు . కొన్నిచోట్ల పందెంరాయుళ్లు ఒక్కో ఆటకు రూ.కోటికిపైగా బెట్టింగ్ వేశారు అంటే ఎంత జోరుగా కోడిపందాలు కొనసాగుతున్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు.

 

వారం నుంచి కోడిపందాలు పెట్టొద్దని, బరులకు స్థలాలు ఇవ్వొద్దని హడావుడి చేసిన పోలీసులు, అధికారులు ప్రస్తుతం పండుగ సమయానికి సైలెంట్ అయ్యారు. దీంతో ఏపీలో కోడిపందాల హడావిడి జోరుగా కొనసాగుతుంది. మరొకవైపు సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు నుంచి బయలుదేరిన ప్రయాణికులు, అలాగే కోడిపందాలను చూడడానికి వెళుతున్న వారు ట్రాఫిక్ జామ్ లతో పడరాని పాట్లు పడుతున్నారు.

 

బస్సులు, కార్లు ఒక్కటేమిటి పండుగకు వెళుతున్న అన్ని వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. సంక్రాంతి పండుగకు విజయవాడ హైవే మీద ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర అవుతుంది . తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే ఈ పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అంతా ఒక్కసారే ప్రయాణాలు సాగించడం ఇందుకు ప్రధాన కారణం.

 

మొత్తంగా ఏపీలో సంక్రాంతి కోడి పందాలతో యమా జోరుగా కొనసాగుతుంది. ప్రతీ ఏడాది కోడిపందాలను నిర్వహించటం ఏపీలో చాలా కాలంగా సాంప్రదాయంగా వస్తుంది. కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టి వాటి ప్రాణాలతో ఆడే ఆట వద్దని ప్రభుత్వం ఎంత చెప్పినా సరే పందెం రాయుళ్ళు మాత్రం తగ్గటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *