కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది కేసీఆర్ తో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారని సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చే ప్రమాదముందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చని జోస్యం చెప్పారు.
కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని విమర్శింాచరు. బీఆర్‌ఎస్ అంటే కూల్చే పార్టీ.. బీజేపీ అంటే నిర్మించేదన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ లోని ఎంపీ ఆఫీస్ లో మానకొండూరుకు చెందిన ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. తెలంగాణ అభివృద్ది కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బండిసంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని తెలుసు కానీ జ్యోతిష్య శాస్త్రం చదివినాడని తెలియదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బండిసంజయ్ అనడం అవివేకమన్నారు.
గడిచిన ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్ ను ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని నలుగురు పీఠాధిపతులు కూడా వ్యతిరేకిస్తున్నారని పొన్నం గుర్తు చేశారు. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సాంప్రదాయ ప్రకారం చేయాలన్నారు.