మహిళా కలెక్టర్‌పై లైంగిక వేధింపులు.. టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్ అరెస్టు..!

తమిళనాడులోని అధికారిక టీవీకే పార్టీ ఎమ్మెల్యే సి. అరుళ్ విఘ్నేష్‌ (C. Arul Vignesh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ జె.ఇ. పద్మజ (J. E. Padmaja)కు అసభ్యకర సందేశాలు పంపారన్న ఆరోపణలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 23వ తేదీనే కలెక్టర్ ఆయనపై ఫిర్యాదు చేయగా.. శుక్రవారం సాయంత్రం విఘ్నేష్‌ను ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్యే నివాసం, కార్యాలయం చుట్టూ భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

మహిళా ఐఏఎస్ అధికారికి ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్ అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపడంతో పాటు, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్ ఆహార్యం, దుస్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు అసభ్యంగా తాకడానికి ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో కలెక్టర్ అధికారిక నివాసానికి వెళ్లేందుకు కూడా ఆయన ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ పద్మజ నవంబర్ 23న కళ్లకురిచ్చి ఎస్పీ షానాజ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కళ్లకురిచ్చి ఉమెన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేపై ఐదు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టంతో పాటు లైంగిక వేధింపులు, వెంబడించడం, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్లను మోపారు.

అంతకుముందు డీఎంకే ఎంపీ కనిమొళి ఈ వ్యవహారాన్ని బయటపెట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగింది. ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే, ఏఐఏడీఎంకే సహా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ (NCW) కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి నిష్పక్షపాత విచారణ జరపాలని కోరింది. మద్రాస్ హైకోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని, సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా దర్యాప్తు జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విచారణ కమిటీ ఏర్పాటు

మరోవైపు కలెక్టర్ పద్మజ నవంబర్ 23న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయికుమార్‌కు కూడా ఫిర్యాదు చేయడంతో తమిళనాడు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన అంతర్గత ఫిర్యాదుల కమిటీని (ICC) ఏర్పాటు చేసింది. అదనపు ప్రధాన కార్యదర్శి కాకర్ల ఉష నేతృత్వంలోని ఈ కమిటీలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. మధుమతి, న్యాయ శాఖ కార్యదర్శి పి. సుమతి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీత జో సభ్యులుగా ఉన్నారు. పోష్ (POSH) చట్టం కింద 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తగిన చర్యలకు సిఫార్సు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సీనియర్ అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు

అటు హైకోర్టు ఆదేశాలతో పోలీసు విచారణను పర్యవేక్షించేందుకు మహిళా పోలీసు బాస్ లను నియమించారు. తిరుప్పూర్ ఎస్పీ సృష్టి సింగ్‌ను దర్యాప్తు అధికారిగా నియమించగా ఐజీపీ ఎన్. కామిని ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్ ఖండించారు. తన ప్రతిష్టతో పాటు అధికార పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.