ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ మిల్లర్లు చేసిన ప్రయత్నాలకు అత్యున్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై పోలీసులు ఇప్పటికే 540 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీటిని రద్దు చేయాలని కోరుతూ మిల్లర్ల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ సందర్భంగా న్యాయస్థానం నుంచి వ్యతిరేకత రావడంతో.. కోర్టు ఆ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్ల తరఫు న్యాయవాదులు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.
లక్షల మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డిఫాల్ట్ మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్లో ఉన్న బియ్యాన్ని తక్షణమే ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే అందుకు సమానమైన బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో కేసుల విచారణకు మార్గం సుగమం కాగా.. బకాయిలు చెల్లించని మిల్లర్లపై ‘రెవెన్యూ రికవరీ యాక్ట్’ కింద ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.