అజిత్ ధోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు..! అసలేం జరిగింది..?

భారత జాతీయ భద్రతా సలహాదరు అజిత్​ ధోవల్​, రీసెర్చ్ అండ్​ అనాలసిస్​ వింగ్​ (RAW) మాజీ చీఫ్​ సుమంత్ గోయల్​ కు అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. భారత కోర్టుల ద్వారా ప్రత్యామ్నాయ పద్దతిలో ఈ సమన్లను పంపించాలని సూచించింది. సమన్ల నేపథ్యానికి వస్తే.. 2023 జూన్​ లో కొంతమంది వ్యక్తులు హర్ దీప్​ సింగ్ నిజ్జర్​ ను హత్య చేశారు. ఆ తరువాత అమెరికాలో ఉంటున్న సిఖ్స్​ ఫర్​ జస్టిస్​ సంస్థ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్​ పన్నూ హత్యకు సైతం కుట్ర జరిగింది. అయితే ఈ కుట్రను అమెరికా నిఘా సంస్థలు భగ్నం చేశాయి.

కాగా, ఈ కుట్ర వెనక భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్​, రా మాజీ చీఫ్​ సుమంత్​ గోయల్ ఉన్నారని ఆరోపిస్తూ గురుపత్వంత్ అమెరికా కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన అమెరికా జిల్లా కోర్టు అజిత్ ధోవల్​, సుమంత్​ గోయల్​ కు సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. అమెరికా న్యాయ నిబంధనల ప్రకారం ప్రతివాదులకు సమన్లు అందితేనే కేసు విచారణ మొదలవుతుంది. ది హేగ్​ కన్వెన్షన్​ ప్రకారం.. 2024లో భారత న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా అజిత్ ధోవల్​, సుమంత్ గోయల్​ కు సమన్లు పంపించటానికి గురుపత్వంత్ ప్రయత్నించాడు. అయితే, ఈ సమన్లు హేగ్​ కన్వెన్షన్​ పరిధిలోకి రావని పేర్కొని భారత ప్రభుత్వం వాటిని వెనక్కి పంపించింది.

దాంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారికి సమన్లు పంపించేందుకు అనుమతించాలంటూ గురుపత్వంత్ అమెరికా కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ మెయిల్​ లేదా కొరియర్ ద్వారా ఢిల్లీలోని జిల్లా కోర్టులు పాటియాలా హౌస్​, తీస్​ హజారీ, ద్వారకా న్యాయస్థానాలకు ఈ సమన్లను పంపించాలని న్యూయార్క్​ సదరన్​ డిస్ట్రిక్ట్​ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తమ కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ దావాలో ప్రతివాదులకు సమన్లు అందజేసే ప్రక్రియలో భారత న్యాయస్థానాల సాయాన్ని గౌరవప్రదంగా అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సమన్లు జారీ చేయడం సాధారణ, విధానపరమైన ప్రక్రియ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమన్లకు అజిత్ ధోవల్​, సుమంత్ గోయల్​ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్టు సమాచారం.

ఇక గురపత్వంత్ విషయానికి వస్తే.. పంజాబ్‌ లోని అమృత్‌సర్ లో జన్మించారు. 1990 దశకంలో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆయనకు అమెరికా పౌరసత్వంతోపాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది. వృత్తి రీత్యా న్యాయవాది అయిన గురుపత్వంత్.. సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది సిక్కుల కోసం ఖలిస్థాన్ పేర ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం ప్రచారం చేస్తోంది. అమెరికాతోపాటు కెనడా పౌరసత్వం కూడా ఉండటంతో ఈ రెండు దేశాల్లో ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలు, న్యాయపరమైన అంశాల్లో గురుపత్వంత్ చురుగ్గా వ్యవహరిస్తుంటాడు.

కాగా, వేర్పాటువాద కార్యకలాపాల కారణంగా 2019లో భారత ప్రభుత్వం సిఖ్స్​ ఫర్ జస్టిస్​ సంస్థపై నిషేధం విధించింది. ‘ఉపా’ చట్టం ప్రకారం గురపత్వంత్​ ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయనపై భారత్‌లో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పంజాబ్, చండీగఢ్‌లోని ఆయన ఆస్తులను ఎన్ఐఏ జప్తు కూడా చేసింది. గురుపత్వంత్​ పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత్ ఇప్పటికే రెండుసార్లు ఇంటర్‌ పోల్‌ ను కోరింది. అయితే ఆయన ప్రత్యక్ష ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు ఆధారాలు లేవని పేర్కొంటూ ఇంటర్‌ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి నిరాకరించింది.