2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ ప్రిపేర్ అవుతున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు.. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో రూటు మార్చుబోతున్నారా? వచ్చే ఏడాది ఆరంభం నుంచి పాదయాత్ర చేపట్టాలని డిసైడ్ అయ్యారా? అందుకే నియోజకవర్గాల ఇన్ఛార్జులను మార్చే పనిలో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీలో భారీ ప్రక్షాళన మొదలైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది చివరలో పాదయాత్రకు వెళ్లాలని తొలుత జగన్ భావించారు. అయితే వచ్చే ఏడాది నుంచి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్టు ఆ పార్టీ వర్గాల మాట. అందుకు కారణాలు లేకపోలేదు. దశాబ్దాల కిందట కేసుల కదలిక స్పీడు కావడంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఒక వేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని ఆలోచన చేస్తున్నారని టాక్.,
రెండో అంశం.. ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపాలిటీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వైసీపీ అధినేత జగన్ క్షుణ్నంగా గమనించారు. ఆ తర్వాత ప్రతీ నియోజకవర్గం నుంచి రిపోర్టు తెప్పించుకున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీతో కలిసిన నాయకులు ఎవరు? నియోజక వర్గాల్లో తిరగని నేతలు, అస్సలు పార్టీని పట్టించుకోని దాదాపు 80 మందికి సంబంధించిన నేతల చిట్టా అధినేత చేతికి అందిందని సమాచారం. వారిని మార్చేయాలని నిర్ణయించుకున్నట్లు లీకులు ఇస్తున్నారు.
నియోజకవర్గాల ఇన్ఛార్జుల జాబితాలో పులివెందుల నియోజకవర్గం ఉన్నట్లు ఆ పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కేసుల వల్ల ఇబ్బంది వస్తే ఆ నియోజకవర్గం నుంచి ఎవర్ని దింపాలి? ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై గడిచిన రెండురోజులుగా కసరత్తు చేసినట్టు సమాచారం. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులలో ఏకగ్రీవాలు జరిగాయి. ఇలాంటి సమయంలో ఒక్కసారి 80 మందిపై వేటు వేస్తే.. ఇబ్బంది వస్తుందని భావించి, ఆ జాబితాలో పులివెందులను చేర్చినట్టు సమాచారం.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏపీలో అసెంబ్లీ సీట్లు 225 కు పెరిగే ఛాన్స్ ఉంది. పక్కన పెట్టిన నేతలు ఆయా నియోజకవర్గాల్లో సర్దుబాటు చేయాలని ఆలోచన చేస్తున్నారట. ఈసారి కొత్తతరం, యువతకు ఎక్కువ సీట్లు కేటాయించాలన్నది జగన్ ఆలోచనగా కొందరు నేతలు చెబుతున్నారు. దానివల్ల యువత తమవైపు తిరిగే అవకాశం ఉంటుందని లెక్కలు వేస్తున్నారని సమాచారం. మొత్తానికి కేసుల కదలిక జోరు కావడంతో జగన్ యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది.