ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ పై రాంచందర్ రావు ఫైర్..!

భారత్ సమ్మిట్ వేదికగా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విదేశీ నేత జియాకోమో ఫిలిబెక్‌పై, సదస్సు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా విదేశీ రాజకీయ ప్రతినిధులు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై రాంచందర్ రావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం సోమవారం శంషాబాద్‌లోని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం(ఎఫ్​ఆర్ ఆర్ వో), డీజీపీకి ఫిర్యాదు చేశారు.

సదరు విదేశీ ప్రతినిధి వ్యాఖ్యలు, భారత ఇమ్మిగ్రేషన్ చట్టాలు, వీసా నిబంధనల ఉల్లంఘనలపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ స్వార్థం కోసం ఓట్ చోర్, గద్దీ ఛోడ్ అంటూ ప్రధాని మోడీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ఇటలీకి చెందిన పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ నాయకుడు జియాకోమో ఫిలిబెక్.. భారత గడ్డపైకి వచ్చి పలకడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఏ దేశంలోనైనా విదేశీయులు వీసా నిబంధనల ప్రకారం ఆ దేశ అంతర్గత రాజకీయాల్లో కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మాట్లాడటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అమెరికా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా తక్షణమే బహిష్కరిస్తారని, దుబాయ్, చైనా వంటి దేశాల్లో అయితే అత్యంత కఠిన శిక్షలు ఉంటాయని గుర్తుచేశారు.

అలాంటిది, భారత గడ్డపై ఒక విదేశీయుడు మన దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తూ మాట్లాడుతుంటే, వేదికపై ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చప్పట్లు కొడుతూ ఆనందించడం కంటే పెద్ద దేశద్రోహ చర్య ఇంకొకటి ఉండదని రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు వీసా నిబంధనలపై కనీస అవగాహన లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్నారని, ఇప్పుడు ఏకంగా విదేశీయులను ఇక్కడికి రప్పించి భారత వ్యతిరేక నినాదాలు చేయించడం దౌర్భాగ్యమని విమర్శించారు. దేశ ప్రజలకు, భారత ప్రజాస్వామ్యానికి చేసిన ఈ అవమానానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025లోని సెక్షన్ 23, సెక్షన్ 29 ప్రకారం, భారతదేశానికి వచ్చి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే విదేశీయులకు మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని రాంచందర్ రావు వివరించారు. రూ. 3 లక్షల జరిమానా రేవంత్ రెడ్డికి పెద్ద విషయం కాకపోవచ్చు కానీ, చట్టప్రకారం ఆ విదేశీ నేతను కచ్చితంగా మూడేళ్ల పాటు జైలుకు పంపాల్సిందేనని స్పష్టం చేశారు. సదరు ఇటలీ నేత ఇంకా భారత్‌లోనే ఉంటే తక్షణమే బహిష్కరించాలని, ఒకవేళ దేశం విడిచి పారిపోయి ఉంటే తిరిగి భారత్‌కు రప్పించి కేసు నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టకుండా బ్లాక్‌లిస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పెట్టుబడుల సదస్సు అని చెప్పి భారత వ్యతిరేక సదస్సుగా మార్చిన భారత్ సమ్మిట్ నిర్వాహకులు ఈ నేరానికి ప్రత్యక్షంగా ప్రేరేపించారని, కాబట్టి నిర్వాహకులందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ అపూర్వానంద్, సలీల్ శెట్టి సహా విదేశీ, స్వదేశీ ప్రతినిధులందరి నేపథ్యంపై లోతైన విచారణ జరపాలని కోరారు. వీరంతా జార్జ్ సోరోస్ పేరోల్‌పై పనిచేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే ఇక్కడికి వచ్చారని ఆరోపించారు.