‘రోడ్ల మీద కాదు.. పార్లమెంట్‌లో చూసుకుందాం’.. రాహుల్ సవాల్‌పై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. సవాళ్లు రోడ్ల మీద కాదని.. చట్టసభల్లో చర్చకు రావాలని పిలుపునిచ్చారు. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సభలో అమిత్ షా మాట్లాడుతూ రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. ‘నేను నేరుగా రాహుల్ గాంధీకే సవాల్ విసురుతున్నాను. మీరు ప్రధాని మోదీతో చర్చించాలని అనుకుంటే ఆయనకు ఒక లేఖ రాయండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ధైర్యముంటే పార్లమెంట్‌కు వచ్చి చర్చించండి’ అని వ్యాఖ్యానించారు.

నవంబర్ 3న రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెడుతూ.. దేశద్రోహులు, విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నదెవరో తేల్చుకునేందుకు యువత సమక్షంలో చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అమిత్ షా తాజాగా స్పందిస్తూ.. రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వకుండా, రోడ్లపై ప్రజలను సమీకరించి గందరగోళం, అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారు. వీధుల్లో గుంపులను చేర్చి రచ్చ చేయాలని చూస్తే బీజేపీ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

అటు ఎలక్షన్ కమిషన్‌పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను షా తప్పుబట్టారు. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు. ‘ఆ ఎన్నికల్లో ఎస్ఐఆర్ ఉందా? అప్పుడు ఎందుకు ఓడిపోయారు? దేశ ప్రజలు మిమ్మల్ని, మీ కూటమిని ఏమాత్రం నమ్మడం లేదు. ఢిల్లీలో 10 లక్షల మందితో నిర్వహించాలనుకున్న సభలో కనీసం 70 వేల సామర్థ్యం ఉన్న గ్రౌండ్ కూడా సగం ఖాళీగా మిగిలిపోయింది’ అని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల వివరాలను దేశ ప్రజల ముందు ఉంచాలని ఈ సందర్భంగా అమిత్ షా డిమాండ్ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారో తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. కాగా, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, విసిరిన సవాల్ కు రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.