త్రిపురలో ఘోరం..! BSF జవాన్లపై కర్రలతో దాడి..

త్రిపుర సరిహద్దు ప్రాంతంలో ఊహించని ఘోరం జరిగింది. దేశ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు భద్రతా దళం BSF జవాన్లపై స్మగ్లర్లు బరితెగించి దాడులకు తెగబడ్డారు. బోక్సానగర్ పరిధిలోని ఆశబరి ప్రాంతంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

నిషేధిత వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో జవాన్లు రెహమాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అది జీర్ణించుకోలేని మిగతా స్మగ్లర్లు, కొందరు స్థానిక గ్రామస్థులు ఒక్కసారిగా జవాన్ల వాహనాన్ని చుట్టుముట్టారు. చేతుల్లో కర్రలు పట్టుకుని తీవ్రంగా దాడి చేశారు. అంతేకాకుండా జవాన్ల తలలపై విచక్షణారహితంగా కొట్టి, వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించడం గమనార్హం. ఈ దాడిలో జవాన్లు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రభుత్వ వాహనం కూడా దారుణంగా ధ్వంసమైంది. ఈ ఘటన వెనుక బంగ్లాదేశీయుల హస్తం కూడా ఉందనే వార్తలు వస్తుండటంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ దారుణ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేస్తూ.. దేశ రక్షణ బాధ్యతల్లో ఉన్న జవాన్లపై దాడులు చేయడం ఏమాత్రం సహించరానిదని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని ఎంతమాత్రం విడిచిపెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి, దాడి చేసిన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు