సోషల్ మీడియాలో పుకార్లను వ్యాపింప చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇటీవల మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయన్న వార్తలు రాష్ట్రంలో కలకలం రేపాయి. రాష్ట్రంలో సగటున రోజుకు 60 మంది వరకు అదృశ్యమైపోతున్నారని సమాచారం. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మరిన్ని పుకార్లు షికారుచేస్తున్నాయి. ఇలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మిస్సింగ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ యువ సైన్యం ఫేస్‌బుక్ పేజ్ అడ్మిన్‌పై కేసు నమోదు చేసి క్రాంతి కిరణ్, వెంకట్, బాలరాజును అరెస్ట్ చేశారు.
మహిళలు, పిల్లల అపహరణలపై రాష్ట్రంలో అసత్యప్రచారం జరుగుతోందని..వాటి పల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. మిస్సింగ్ కేసులలో చాలావరకు కుటుంబం, ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో ఫెయిలవడం, పిల్లలు తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోవడం, కొడుకులు సరిగా,
చూసుకోక పోవడంతో తల్లిదండ్రులు వెళ్లిపోవడం వంటి కారణాల వల్ల నమోదవుతున్నాయని స్పష్టంచేశారు. మిస్సింగ్ కేసులలో 85 శాతానికి పైగా ట్రేస్ చేశామని, మిగతా కేసుల పరిష్కారానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో పుకార్లను వ్యాపింప చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.