ప్రభుత్వ సేవల్లో ఏఐ..! తెలంగాణలో ‘ఏఐ సాక్షమ్’ కార్యక్రమం ప్రారంభం..

తెలంగాణలో ప్రభుత్వ సేవలను మరింత వేగవంతం, పారదర్శకం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఏఐ సాక్షమ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో ప్రారంభించారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం యొక్క ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగిన ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల వేగం పెంచి, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతులు, పింఛనుదారులు వంటి వారు పదేపదే ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితికి చరమగీతం పాడాలన్నారు. ప్రభుత్వ నిధుల వినియోగం, సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతున్నాయా లేదా అనే విశ్లేషణ, విద్యుత్ డిమాండ్ అంచనా వంటి పనులకు ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు.

అదే సమయంలో ఏఐ వినియోగంలో పలు జాగ్రత్తలు తప్పనిసరి అని భట్టి నొక్కిచెప్పారు. ఏఐ అందించిన సమాచారాన్ని అధికారులు కచ్చితంగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని, ఏఐ నిర్ణయాలపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. చిన్నస్థాయి ప్రయోగాలు విజయవంతమైన తర్వాతే ఏఐ వ్యవస్థలను విస్తరించాలని, ఏవైనా లోపాలు జరిగితే బాధ్యత ఎవరిదనే దానిపై స్పష్టత ఉండాలని అన్నారు. ప్రజలకు అందే వేగవంతమైన, పారదర్శక సేవలే ఏఐ విజయానికి గీటురాయి అవుతాయని ఆయన పేర్కొన్నారు.