బ్యాలెట్ పేపర్లలోనూ కాంగ్రెస్‌కు సున్నా..! ప్రధాని మోదీ సంచలన కౌంటర్..!

దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ఈ ఓటమితో ప్రతిపక్ష పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని అర్ధం వచ్చేలా ఎక్స్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్యాలెట్‌ పత్రాలతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని గుర్తుచేస్తూ.. కాంగ్రెస్‌ ఎన్ని స్థానాలు గెలిచిందో ఊహించాలంటూ పోస్టు చేశారు. దీనికి ‘మోనోకిల్‌’ ఎమోజీని జతచేశారు.

యూపీ, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక రాష్ట్రాల్లో మెుత్తం 28 శాసనమండలి స్థానాలకు ఇటీవల ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 12 స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన నాలుగు స్థానాలను కూడా నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా తాము అధికారంలో ఉన్న కర్ణాటకలోనే ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం కాంగ్రెస్‌కు అతిపెద్ద పరాభవంగా మారింది.ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందని, తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్నే తీసుకురావాలని కాంగ్రెస్ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ఫలితాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరిగాయనే విషయాన్ని గుర్తుచేస్తూ.. ‘ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక వంటి 4 పెద్ద రాష్ట్రాల్లో 28 సీట్లకు ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరిగాయి. మరి కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి?’ అని మోదీ ఎక్స్‌లో మోనోకిల్ (కంటి అద్దం) ఎమోజీని జతచేస్తూ పోస్ట్ చేశారు.

మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ కూడా కాంగ్రెస్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఓటమి ఎదురైనప్పుడల్లా ఈవీఎంలను బోనులో నిలబెట్టి ఓట్ల చోరీ అని ఆరోపణలు చేసేవారికి ప్రజలు బ్యాలెట్ పేపర్ల ద్వారా కూడా తగిన సమాధానం చెప్పారు. నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేని కాంగ్రెస్ నాయకులు ఇకనైనా సాకులు చెప్పడం మానేసి, క్షేత్రస్థాయిలోకి వచ్చి అసలు నిజాలు తెలుసుకోవాలి’ అని విమర్శించారు.

అయితే బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలనే తమ డిమాండ్‌కే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఇటీవల మాట్లాడూతూ.. దేశవ్యాప్తంగా పౌరులు, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, ఈవీఎంలపై తమ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సరైన సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో మళ్లీ నమ్మకం కలగాలంటే బ్యాలెట్ విధానానికే తిరిగెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.