ఆంధ్రప్రదేశ్‌ను తాకిన ‘అర్నబ్’ తుఫాన్ విపత్తును ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఉన్నతస్థాయి సమీక్షలు, బుధవారం తెల్లవారుజాము నుంచే టెలీకాన్ఫరెన్స్‌లు, రాష్ట్ర సచివాలయం నుంచి రియల్-టైమ్ మానిటరింగ్ ద్వారా సహాయక చర్యలను ఆయన స్వయంగా ముందుండి నడిపిస్తున్నారు. బుధవారం ఉదయం నరసాపురం వద్ద తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ముంపు ముప్పున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, సహాయక చర్యలను వేగవంతం చేసి నిత్యావసర సేవలను తక్షణమే పునరుద్ధరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించి, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తూనే సహాయ పునరుద్ధరణ పనులను ముమ్మరం చేసింది. మరోవైపు, తుఫాన్ వల్ల వాటిల్లిన ప్రాథమిక నష్టాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పంట, ఆస్తి నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని, సహాయ పునరావాస చర్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన మద్దతు కొనసాగించాలని ఆ లేఖలో కోరారు.
ముఖ్యమంత్రి రాత్రంతా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షించారు. బుధవారం ఉదయం సుమారు 32,000 మంది అధికారులు, సిబ్బందితో భారీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభావిత జిల్లాల్లో సమన్వయ కార్యాచరణను ఖరారు చేశారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రం ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రత్యక్ష దృశ్యాలను ముఖ్యమంత్రి స్వయంగా వీక్షించారు. తుఫాన్ కదలికలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, రహదారుల పరిస్థితి, విద్యుత్ అంతరాయాలు, ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సీఎంకు వివరించారు.
24 గంటలూ అందుబాటులో..
విద్యుత్, సాగునీటి పారుదల, రోడ్లు-భవనాలు, వ్యవసాయం, పురపాలక-పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సీఎం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు స్వయంగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో తగినంత ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు నిరంతరం అందేలా చూడాలని, పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి సురక్షితమని భావించిన తర్వాతే బాధితులను ఇళ్లకు పంపాలని ఆదేశించారు.
కేంద్ర సాయం కోరిన చంద్రబాబు..
రాష్ట్రంలో విపత్తు సహాయక చర్యల కోసం 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 11 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను మోహరించారు. బుధవారం అందిన సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 84,396 మందిని సురక్షితంగా 290 పునరావాస కేంద్రాలకు తరలించారు. రాష్ట్ర అత్యవసర నిర్వహణ కేంద్రం (SEOC), జిల్లా కంట్రోల్ రూమ్‌లు సంయుక్తంగా స్థానిక అవసరాలను పర్యవేక్షిస్తున్నాయి.
అమిత్ షాకు లేఖ..
కేంద్ర మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలోని ప్రాథమిక అంచనాల ప్రకారం.. సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట, 10,450 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయి. దాదాపు 180 ఇళ్లు దెబ్బతిన్నాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇవి ప్రాథమిక గణాంకాలు మాత్రమేనని, పూర్తిస్థాయి క్షేత్ర పరిశీలన అనంతరం స్పష్టత వస్తుందని తెలిపారు. పొలాల్లో చేరిన మురుగునీటిని వెంటనే బయటకు మళ్లించే చర్యలు చేపట్టాలని, చెరువులు, కాలువల నీటిమట్టాలపై నిరంతరం నిఘా ఉంచాలని జలవనరుల శాఖను సీఎం ఆదేశించారు.
రైతులకు తక్షణ సాయం.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ
తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. అర్నబ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీతో పాటు అత్యవసర ఆర్థిక సాయాన్ని మంజూరు చేయాలని కోరారు. అలాగే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి సమగ్ర నివేదికలు రూపొందించాలని, పొలాల్లో నిలిచిన నీటిని యుద్ధప్రాతిపదికన తొలగించి పంటలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
రోడ్ల క్లియరెన్స్‌కు 2 గంటల డెడ్‌లైన్..
రవాణా వ్యవస్థకు ఆటంకం కలగకుండా ఉండేందుకు.. రహదారులపై కూలిన చెట్లను 2 గంటల వ్యవధిలోనే తొలగించాలని విపత్తు నిర్వహణ, పోలీస్, మున్సిపల్ శాఖలను సీఎం ఆదేశించారు. జాతీయ రహదారులపై ఎక్కడా రాకపోకలు స్తంభించకుండా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 220కి పైగా చెట్లు రోడ్లపై పడగా, బుధవారం మధ్యాహ్నానికే 170కి పైగా చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించారు. యానాం పరిసరాలు, ఏలూరు, విశాఖపట్నంలో రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా సాగాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క కోనసీమ జిల్లాలోనే దాదాపు 6,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు కలెక్టర్ నివేదించారు. గాలుల తీవ్రత తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది స్తంభాలు, తెగిపడిన తీగలను సరిచేస్తూ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.
‘మన మిత్ర’, కంట్రోల్ రూమ్..
తుఫాన్ ప్రభావానికి గురైన ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించేందుకు ప్రభుత్వం ‘మన మిత్ర’ యాప్, వాట్సాప్, సోషల్ మీడియా, జిల్లా కంట్రోల్ రూమ్‌లను విస్తృతంగా వినియోగిస్తోంది. ఆర్టీజీ కార్యదర్శి కాటంనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్ పర్యవేక్షణలో ఫిర్యాదులను తక్షణమే సంబంధిత శాఖలకు చేరవేస్తూ పరిష్కరిస్తున్నారు. సమస్య పరిష్కారమైన వెంటనే ఆ విషయాన్ని బాధితుడికి తెలియ జేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు యంత్రాంగం 24 గంటలూ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.