నకిలీ పోలీస్ అవతారమెత్తి వరుసగా నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తుని పై సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్ పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలానికి చెందిన నాగరాజు రఘువర్మ అలియాస్ వంశీ (29) కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. మొదట్లో డ్రైవర్ గా పనిచేశాడు. దీని ద్వారా ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో తేలికగా డబ్బు సంపాదించి జల్సాగా జీవితం గడపాలని నేరాల బాట పట్టాడు. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారిగా నటిస్తూ టార్గెట్ చేసుకున్న వారిని మీపై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని చెప్పేవాడు. చట్టపరమైన చర్యలు తప్పవని భయపెట్టేవాడు, కేసుల నుండి కాపాడతామని చెప్పి డబ్బులు వసూలు చేసేవాడు. అంతేకాకుండా, వ్యక్తులను కిడ్నాప్ చేసి, తుపాకులు చూపించి వారి వద్ద ఉన్న నగదును దోచుకునేవాడు. ఇలా 2017 నుంచి 2026 మధ్య కాలంలో మోసం, కిడ్నాప్, దోపిడీ, బలవంతపు వసూళ్లు, నేరపూరిత బెదిరింపుల వంటి నేరారోపణలతోపాటు మారణాయుధాల నిరోధక చట్టం ప్రకారం అతనిపై 14 కేసులు నమోదయ్యాయి.
ఇంతకు ముందు 2021, 2024లో పీడీ యాక్ట్ ప్రకారం రిమాండ్ కు పంపించినా జైలు నుంచి విడుదల కాగానే నాగరాజు నేరాలు చేయటాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో కిడ్నాప్, బలవంతపు వసూళ్లు, దోపిడీకి సంబంధించిన మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాగరాజుపై పీడీ యాక్ట్ ను ప్రయోగిస్తూ కమిషనర్ రమేశ్ మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో జగద్గిరిగుట్ట పోలీసులు నాగరాజును అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్ చేశారు.