ప్రతి కార్యక్రమానికి ప్రధానిని పిలవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను సాధకుడినని తెలిపిన కేసీఆర్… తన సారథ్యంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరించిన సీఎం కేసీఆర్… కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించడంపై తనదైన శైలిలో స్పందించారు. ప్రధానిని ప్రతిదానికి పిలవాలా ? అని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించామని గుర్తు చేశారు. ప్రతిదానికి ప్రధానిని పిలవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను సాధకుడినని తెలిపిన కేసీఆర్… తన సారథ్యంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుందని స్పష్టం చేశారు.కేంద్రంతో తమకు స్నేహం కానీ వైరం కానీ లేదని తెలిపిన సీఎం కేసీఆర్… కేంద్రంతో రాజ్యాంగపరమైన సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం అందించిన సాయం ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి మరోసారి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు మొత్తం రాష్ట్ర నిధులతో పాటు రాష్ట్ర వివిధ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చుకున్న నిధులతోనే నిర్మాణమైందని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగరీథ కార్యక్రమాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచిస్తే… కేంద్రం కనీసం రూ. 24 కూడా ఇవ్వలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.