సామాజిక మాధ్యమాల్లో మనం పెట్టే ఒక సాధారణ పోస్ట్ కొన్నిసార్లు ఊహించని అద్భుతాలకు దారితీస్తుంది. సరిగ్గా అలాంటి ఘటనే థాయ్‌లాండ్‌లో జరిగింది. ఒక పర్యాటకుడు సరదాగా ఫేస్బుక్లో షేర్ చేసిన ఫొటో.. ఏకంగా 12 కోట్ల ఏళ్ల కిందటి డైనోసార్ పాదముద్రల జాడను ప్రపంచానికి తెలియజేసింది. ఈ అరుదైన ఆనవాళ్లు థాయ్‌లాండ్‌లోని ఉడాన్ థానీ ప్రావిన్స్‌లో ఉన్న ఫూ ఫ్రాబాట్ నేషనల్ పార్కులో వెలుగుచూశాయి. ఈ ప్రాంతంలో డైనోసార్ పాదముద్రలను అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
అసలేం జరిగిందంటే..!
32 ఏళ్ల పించాయ్ ప్రథెత్సేనా అనే పర్యాటకుడు ఇటీవలే ఫూ ఫ్రాబాట్ నేషనల్ పార్కులో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో అక్కడి ఒక వాగులో నీటి మట్టం తక్కువగా ఉండటంతో రాతి నేలపై కొన్ని వింత ఆకారపు గుర్తులను గమనించాడు. అవి సాధారణ గుర్తుల కంటే భిన్నంగా ఉండటంతో వెంటనే వాటిని ఫొటో తీశాడు. అయితే, ఆ సమయంలో సమీపంలో పార్క్ రేంజర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆ ఫొటోను ఒక ఫేస్బుక్ గ్రూపులో పోస్ట్ చేసి.. “ఇవి డైనోసార్ పాదముద్రలు కావొచ్చా?” అని పేర్కొన్నాడు.
ఆ పోస్ట్ కాస్తా థాయ్‌లాండ్ ఖనిజ వనరుల శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్) అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన అధికారులు, ఒక నిపుణుల బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అవి డైనోసార్ పాదముద్రలే అని అధికారికంగా ధ్రువీకరించారు. అక్కడ మొత్తం ఆరు పాదముద్రలు ఒక వరుస క్రమంలో ఉన్నట్లు గుర్తించారు. సుమారు 120 మిలియన్ సంవత్సరాల కిందటి తొలి క్రెటేషియస్ కాలానికి చెందిన ఫూ ఫాన్ ఫార్మేషన్‌లోని ఇసుకరాతి పొరల్లో ఈ పాదముద్రలు భద్రంగా ఉన్నాయని తెలిపారు.
థెరోపాడ్ డైనోసార్విగా నిర్ధారణ
ఈ పాదముద్రలు ఒక్కొక్కటి సుమారు 29 సెంటీమీటర్ల పొడవు, 26 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రతి పాదముద్రలో మూడు పదునైన వేళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆనవాళ్ల ఆధారంగా ఇది రెండు కాళ్లపై నడిచే మాంసాహార థెరోపాడ్ జాతికి చెందిన డైనోసార్ అని అంచనా వేశారు. ఆ డైనోసార్ తుంటి ఎత్తు సుమారు 1.42 మీటర్లు, మొత్తం పొడవు 6.3 మీటర్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ అరుదైన ఆనవాళ్లు చాలా సున్నితంగా ఉండటంతో నీటి ప్రవాహం, పర్యాటకుల తాకిడి వల్ల దెబ్బతినకుండా ఉండేందుకు అధికారులు ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పాదముద్రలను మరింత లోతుగా అధ్యయనం చేసి, వాటిని సంరక్షించేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు. అవసరమైతే ఆ వాగు ప్రవాహాన్ని మళ్లించే ఆలోచన కూడా చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రదేశాన్ని విద్యా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.