మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన..?

చారిత్రక హైదరాబాద్ నగరానికి బీచ్ గా మారిన హుస్సేన్ సాగర్ చెరువును పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన పర్యాటకపరంగా అభివృద్ది చేసే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పలు దఫాలుగా ఈ అంశంపై చర్చ కూడా జరిగినట్లు సమాచారం. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ టూరిజం సర్క్యుట్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిపాదనలు కూడా సిద్దం చేసిన సంగతి తెల్సిందే.

ఇదిలా ఉండగా 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మూసీ పునరుజ్జీవం, ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రక్రటించి దశల వారీగా నిధులు మంజూరు చేస్తూ ప్రాజెక్టును నాలుగు జోన్లుగా అభివృద్ది చేసే పనులు మెల్లిగా ముందుకు సాగుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలోని పలు చారితక్ర కట్టడాలు, దేవాయాలను సైతం కాపాడుకుంటూనే టూరిజం పరంగా అభివృద్ది చేయాలని నిర్ణయించిన సర్కారు ఇటీవలే రెండు చారిత్రక దేవాలయాల అభివృద్ది కోసం నిధులను కూడా మంజూరు చేసిన సంగతి తెల్సిందే. అలాగే హుస్సేన్ సాగర్ ను కూడా పూర్తి స్థాయిలో శుద్ధి చేసేందుకు గత పాలకులు పలు సార్లు ప్రయత్నాలు చేసినా, అనూహ్యాంగా ఎదురైన అడ్డంకుల కారణంగా పనులను ముందుకు తీసుకెళ్లలేకపోయారు.

గత గులాబీ సర్కారు కూడా కొలువుదీరిన వెంటనే తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సైతం హుస్సేన్ సాగర్ చుట్టూ పర్యటించి, హుస్సేన్ సాగర్ లోని మురికినీటిని కొబ్బరి నీళ్లలాగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు ప్రకటించినా, ఆ ప్రతిపాదనలు కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇదే విషయం ప్రాతిపదికన హుస్సేన్ సాగర్ ను కూడా మూసీ నది తరహాలో శుద్ధి చేయటంతో పాటు చెరువు చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టి, టూరిజం పరంగా అభివృద్ది చేయాలన్న అంశంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, సంబంధిత విభాగాధిపతులతో కీలకమైన చర్చ జరిగినట్లు తెల్సింది.

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, టూరిజం పరంగా అభివృద్ది చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ఇప్పటికే నిధులను వెచ్చిస్తున్నా, ఆశించిన స్థాయిలో ప్రక్షాళన, అభివృద్ది జరగటం లేదన్న విషయాన్ని సర్కారు గుర్తించింది. ఒక్కో విభాగం వారీగా అరకొర నిధులు ఖర్చు చేస్తూ అక్కడక్కడ అభివృద్ది చేయకుండా మూసీ నది తరహాలోనే భారీగా నిధులు వెచ్చించి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులను భారీగా చేపట్టాలని పాలకులు, అధికారుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ ఈ సర్కారుకు ఈ పర్యాయం ముగిసిన తర్వాత మళ్లీ గెలిచి, అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టును ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.

హుస్సేన్ సాగర్ చెరువు శుద్ధి పనులను మరోసారి అధికారంలోకి రాగానే అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించిన సర్కారు కేవలం చెరువు ప్రక్షాళనే గాక, సాగర్ చుట్టూ పర్యాటక పరంగా అభివృద్ది పనులు చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ప్రస్తుతం టూరిజం శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ సౌకర్యం కల్పించి, టూరిజం పరంగా అభివృద్ది చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి తోడు హుస్సేన్ సాగర్ శోభను వీక్షించేందుకు వీలుగా నలువైపులా స్కై వేలను ఏర్పాటు చేయాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు గాను ఇప్పటికే హెచ్ఎండీఏ సిద్దం చేసిన సాగర్ చుట్టూ టూరిజం సర్క్యుట్ ప్రతిపాదనల్లో రానున్న 30 ఏళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని మార్పులు చేసి, అమలు చేయాలని కూడా సర్కారు వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. చిన్నారులను ఆకట్టుకునేలా ట్రాయ్ ట్రెయిన్ ను అందుబాటులోకి తేవాలన్న చర్చ కూడా జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.