వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమించారు సీఎం వైఎస్ జగన్.
వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నాయకులకు పలు పదవులు ఇస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… మరో ముఖ్యనేతకు కీలక పదవి అప్పగించారు. వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమించారు సీఎం వైఎస్ జగన్. అంతేకాదు సజ్జలకు కేబినెట్ హోదా ర్యాంక్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పకీ… వైసీపీ రాజకీయ వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. పలు అంశాలపై పార్టీ స్పందన తెలియజేయడంతో పాటు ప్రత్యర్థులపై రాజకీయ దాడి చేయడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారనే చెప్పాలి.
పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జలకు కీలకమైన పదవి ఖాయమని వైసీపీ శ్రేణులు భావించాయి. అందుకు తగ్గట్టుగానే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమించడంతో పాటు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావుకు కూడా ఇదే రకమైన పదవిని కట్టబెట్టడం గమనార్హం.