రైలు బోగీల్లో డ్రగ్స్.. కారు డిక్కీలో డ్రగ్స్.. లారీ నిండా గంజాయి. నిత్యం ఏదో ఒక వాహనంలో సరుకు చేరాల్సిన చోటుకి చేరుతూనే ఉంది. అందుకే ఏపీలో డ్రగ్స్ గ్యాంగ్‌లపై కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉక్కుపాదం మోపుతోంది. మొదట విజయవాడ రైల్వే స్టేషన్లో పోలీసుల ACTION చూడండి. బెంగళూరు నుంచి వచ్చిన రైలను నుంచి నాగ సౌమ్య అనే యువతి దిగింది. ఆమె ఎంబీఏ చదువుతోంది. కానీ బ్యాగులో ఉన్నది పుస్తకాలు కాదు.. నూట పది గ్రాముల తెల్లని పొడి ఉంది. దాని విలువ అక్షరాల 11లక్షల రూపాయలు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టింది.. రైల్వేస్టేషన్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెకు సరుకు పంపిన హ్యాండ్లర్ షేక్ బషీర్‌ను కూడా పట్టుకున్నారు.
ఇక కర్నూలు జిల్లా, అమకతాడు.. ఇక్కడ మరో ట్విస్ట్.. ఓ కారు నిశ్చబ్దంగా వచ్చింది. అందులో యువకుల భవిష్యత్‌ను కాల్చేసే విషముంది. 20 గ్రాముల MDMA. దాని విలువ రెండు లక్షల రూపాయలు. డ్రైవింగ్ సీట్లో ఉన్న నల్లూరి వరుణ్ తేజ పోలీసుల చేతికి చిక్కాడు. ఇక ఒడిశా కొండల నుంచి షిర్డీ వైపు ఓ లారీ వెళ్తోంది. విశాఖ జిల్లా తుర్లువాడ టోల్ గేటు దగ్గర ఏపీ పోలీసులు అడ్డుకొని చెక్ చేశారు. లోపల 3వందల 85 కిలోల ఎండు గంజాయి లోడ్ చేసి ఉంది. దాని విలువ ఒక కోటీ తొంభై లక్షల రూపాయలు.
ఇప్పుడు అసలు షాక్ వినండి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మట్టిలో రెండెకరాల్లో విషం పచ్చగా పెరిగింది. పోలీసులు రంగంలోకి దిగి.. గంజాయి పంటనంతా తగలబెట్టేశారు. సూత్రధారి ఉప్పలపాటి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనపై ఆల్రెడీ పదకొండు కేసులు ఉన్నాయి. ఈగల్ టీమ్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్.. అందరూ కలిసి కొట్టిన కాంబో దెబ్బ ఇది. ఒకవైపు రైళ్లలో డ్రగ్స్ రవాణా.. మరోవైపు కార్లలో MDMA సప్లై.. ఇంకోచోట భారీగా గంజాయి తరలింపు.. చివరికి పొలాల్లోనే అక్రమ సాగు. మత్తు వ్యాపారానికి ఎక్కడ దారి దొరికినా అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ లేని రేపటి ఉదయం కోసం ఈ వేట ఆగదు, ఈ యాక్షన్ తగ్గదు.