ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌..

తెలంగాణలోని పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి గడ్కరీ ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ కష్టాలు గణనీయంగా తీరనున్నాయి. వీటితో పాటు, కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ల శంకుస్థాపన ప్రతిపాదనకు కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనపై కూడా గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇదే క్రమంలో, నవంబర్‌ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఇండియన్‌ రోడ్‌’ కాంగ్రెస్‌ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని గడ్కరీని ఆయన ఆహ్వానించారు.